రేషన్ కార్డు లబ్ధిదారులకు BIG అలర్ట్.. ఇకపై వ్యక్తికి 7 కేజీల రేషన్!

by Prasad Jukanti |   (  Updated:2026-06-25 10:43:38  IST  )

అంత్యోదయ అన్నయోజన స్కీమ్‌లో మార్పులకు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలు చేసింది.

రేషన్ కార్డు లబ్ధిదారులకు BIG అలర్ట్.. ఇకపై వ్యక్తికి 7 కేజీల రేషన్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలోని అత్యంత పేద కుటుంబాలకు రేషన్ పంపిణీ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులకు శ్రీకారం చుట్టబోతోంది. ఇందులో భాగంగా అంత్యోదయ అన్నయోజన స్కీమ్‌లో మార్పులకు కసరత్తు మొదలు పెట్టింది. జాతీయ ఆహార భద్రత చట్టం (NFSA) కింద ఇచ్చే అంత్యోదయ అన్న యోజన (AAY) రేషన్ కోటాలో మార్పులు చేస్తూ 'నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ (అమెండ్‌మెంట్) బిల్లు, 2026' ముసాయిదాను కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ ప్రజాభిప్రాయం కోసం విడుదల చేసింది. దీని ప్రకారం ఇకపై అంత్యోదయ అన్న యోజన స్కీమ్ లబ్ధిదారుల్లో వ్యక్తికి ఏడు కేజీల చొప్పున రేషన్ ఇవ్వాలని ప్రతిపాదన చేసింది.

గరిష్టంగా 35 కిలోలు:

ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనల ప్రకారం.. అంత్యోదయ (AAY) కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి, వారి కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉన్నారనే దానితో సంబంధం లేకుండా నెలకు ఫిక్స్‌డ్‌గా 35 కిలోల రేషన్ ఇస్తున్నారు. దీనివల్ల చిన్న కుటుంబాల్లోని లబ్ధిదారులకు, ఎక్కువ మంది ఉన్న లబ్ధిదారులు ఉన్న కుటుంబాలకు అంతే రేషన్ లభిస్తోంది. ఈ వ్యత్యాసాలను తొలగించడంలో భాగంగా ఈ మార్పులు తీసుకువస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. ఈ కొత్త సవరణ బిల్లు ప్రకారం ఇకపై కుటుంబం ప్రాతిపదికన కాకుండా, కుటుంబంలోని ప్రతి వ్యక్తి (లబ్ధిదారుడు) లెక్కన నెలకు 7 కిలోల చొప్పున ఆహార ధాన్యాలను పంపిణీ చేయనున్నారు. అయితే ఒక కుటుంబానికి నెలకు ఇచ్చే గరిష్ట రేషన్ కోటాను మాత్రం 35 కిలోలకే పరిమితం చేయనున్నట్లు స్పష్టం చేశారు .

చిన్న కుటుంబాలకు కోత:

కొత్త ప్రతిపాదనలు అమల్లోకి వస్తే అంత్యోదయ కార్డులో పేరున్న ప్రతి ఒక్కరికీ నెలకు సబ్సిడీ ధరపై 7 కిలోల ఆహార ధాన్యాలు లభిస్తాయి. ఈ విధానం చిన్న కుటుంబాలకు కోటాలో కోత పడనుంది. అంటే ఏదైనా కుటుంబంలో సభ్యుల సంఖ్య 5 కంటే తక్కువ ఉంటే, ఆ సంఖ్య ఆధారంగా రేషన్ తగ్గుతుంది. ఉదాహరణకు ముగ్గురు (3) లబ్ధిదారులు ఉన్న కుటుంబానికి ప్రస్తుతం 35 కిలోల రేషన్ లభిస్తుంటే ఇకపై ఒక్కో వ్యక్తికి 7 కిలోల చొప్పున నెలకు కేవలం 21 కిలోలు మాత్రమే అందనున్నాయి. ఇక పెద్ద కుటుంబంలో 5 లేదా అంతకంటే ఎక్కువ మంది సభ్యులు ఉన్నప్పటికీ ఆ కుటుంబానికి నెలకు లభించే మొత్తం రేషన్ 35 కిలోల కంటే మించదు. అంత్యోదయ అన్న యోజన కింద ప్రస్తుతం ఉన్న కుటుంబ ఆధారిత కోటా వల్ల సభ్యుల సంఖ్యను బట్టి అసమానతలు వస్తున్నాయని వీటిని తొలగించి అందరికీ సమానమైన పంపిణీ కోసమే ఈ సవరణ తెస్తున్నట్లు ముసాయిదాలో పేర్కొన్నారు.ఈ డ్రాఫ్ట్ బిల్లుపై దేశ ప్రజలు, సంబంధిత వర్గాల నుంచి కేంద్ర ప్రభుత్వం సూచనలు, సలహాలను ఆహ్వానించింది. ఆసక్తి ఉన్నవారు తమ అభిప్రాయాలను 2026 జూలై 13వ తేదీ లోగా కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖకు సమర్పించవచ్చుని పేర్కొన్నారు.




Next Story