- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జానూ ఎక్కడున్నావ్! వీడని చిన్నారి ‘జ్ఞానేశ్వరి’ మిస్సింగ్ మిస్టరీ.. 20 రోజులైనా లభించని ఆచూకీ
కాకినాడ జిల్లా తుని రూరల్ మండలం సీహెచ్ అగ్రహారం ప్రాంతంలో అదృశ్యమైన రెండున్నరేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు మిస్టరీగా మారింది.

దిశ, డైనమిక్ బ్యూరో: కాకినాడ జిల్లా తుని రూరల్ మండలం సీహెచ్ అగ్రహారం ప్రాంతంలో అదృశ్యమైన రెండున్నరేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి (జానూ) మిస్సింగ్ కేసు మిస్టరీగా మారింది. జూన్ 6న ఇంటి నుంచి కనిపించకుండా పోయిన పాప ఆచూకీ 20 రోజులు గడుస్తున్నా లభించకపోవడంతో అధికారులు తాత్కాలికంగా గాలింపు చర్యలను నిలిపివేసినట్లు సమాచారం. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అటవీశాఖ బృందాలు డ్రోన్లు, స్నిఫర్ డాగ్స్ సాయంతో కాలువలు, అటవీ ప్రాంతాలు, కొండ పరిసరాల్లో విస్తృతంగా గాలించినప్పటికీ ఎలాంటి ఆధారాలు లభించలేదు. దీంతో తాత్కాలికంగా సెర్చ్ ఆపరేషన్‌ను ఆపివేసినట్లు అధికారుల సమాచారం. బిడ్డ జాడ తెలియకపోవడంతో, గాలింపు చర్యలు కూడా నిలిచిపోవడంతో తల్లి భవాని తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తెలిసింది.
సాంకేతిక దర్యాప్తుపైనే దృష్టి..
గాలింపు చర్యలు నిలిపివేసినప్పటికీ, కేసు దర్యాప్తును పోలీసులు కిడ్నాప్ కోణంలో ముమ్మరం చేశారు. తుని రూరల్ పోలీసులు సీసీటీవీ ఫుటేజీలు, మొబైల్ టవర్ డంప్, కాల్ డేటా వంటి సాంకేతిక ఆధారాలను విశ్లేషిస్తున్నారు. మరోవైపు, ఈ కేసులో పెంపుడు కుక్క పాత్ర ఉత్కంఠ రేపుతోంది. పాపతో పాటే అదృశ్యమై, నాలుగు రోజుల తర్వాత ఇంటికి తిరిగొచ్చిన పెంపుడు కుక్కకు పోలీసులు జీపీఎస్ ట్రాకర్ అమర్చారు. అయితే, ఆ కుక్క 8 కిలోమీటర్లు పరిగెత్తి అనుమానాస్పదంగా మృతి చెందడం పలు ప్రశ్నలకు తావిస్తోంది. ప్రస్తుతం ఆ కుక్క పోస్టుమార్టం నివేదిక కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు. ఆ రిపోర్ట్ వస్తే ఘటన జరిగిన సమయంలో అసాధారణ పరిస్థితులు ఏమైనా ఉన్నాయా అనేది తెలిసే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ప్రభుత్వాన్ని నివేదిక కోరిన హైకోర్టు..
రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన ఈ ఘటనపై ఇప్పటికే ఏపీ హైకోర్టు సీరియస్‌గా స్పందించింది. జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు దర్యాప్తు పురోగతిపై సమగ్ర నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, పోలీసులను ఆదేశించింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించారా లేదా అని కూడా వివరణ కోరింది. ఇంత పెద్ద ఎత్తున గాలింపు చేపట్టినా చిన్నారి జాడ దొరకకపోవడం, కుక్క అనుమానాస్పద మృతికి గల కారణాలు తెలియకపోవడం వంటి పలు ప్రశ్నలకు సమాధానాలు దొరికితేనే ఈ మిస్టరీ వీడే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. బిడ్డ సురక్షితంగా తిరిగి వస్తుందని కుటుంబ సభ్యులు ఆశగా ఎదురుచూస్తున్నారు.






