జపాన్ ప్రధానిగా సానే తకాయిచి

by Muthe.Rajitha |

జపాన్ ప్రధానమంత్రిగా సానే తకాయిచి బాధ్యతలు చేపట్టారు.

జపాన్ ప్రధానిగా సానే తకాయిచి
X

దిశ, వెబ్ డెస్క్ : జపాన్ ప్రధానిగా సానే తకాయిచి (Sanae Takaichi) బాధ్యతలు చేపట్టారు. అంతేకాదు జపాన్ చరిత్రలో తొలి మహిళా ప్రధానమంత్రిగా తకాయిచి రికార్డు సృష్టించారు. గత సెప్టెంబరులో మాజీ ప్రధాని షిగెరు ఇషిబా రాజీనామా చేయడంతో లిబరల్ డెమోక్రటిక్ పార్టీ (LDP) అధ్యక్షురాలిగా తకాయిచి ఎన్నికైంది. అయితే జపాన్ లో ఎవరైతే LDP అధ్యక్షులుగా ఉంటారో వారు ప్రధాని బాధ్యతలు కూడా నిర్వర్తించాలి. దీంతో అక్టోబర్ 21 నుంచి ఆమె జపాన్ ప్రధాన మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇక ఇటీవల ఫిబ్రవరి 8లో జరిగిన స్నాప్ ఎన్నికల్లో LDPకు భారీ మెజారిటీ లభించింది. అనంతరం ఫిబ్రవరి 18న జపాన్ పార్లమెంట్ (డైట్) మళ్లీ తకాయిచినే ప్రధానమంత్రిగా ఎన్నుకుంది. ఎంపరర్ నారుహి ఆమెను ఔపచారికంగా(ప్రధానిగా) నియమించారు. అలా ఇది ఆమె రెండోసారి పదవీ స్వీకరణ కావడం విశేషం.

కాగా సానే తకాయిచి 1961 మార్చి 7న జన్మించారు. ఆమె LDPలో సంప్రదాయవాది, జాతీయవాది ధోరణి కలిగిన నాయకురాలిగా గుర్తింపు పొందారు. మాజీ ప్రధాని షింజో అబేకు సన్నిహితురాలిగా కూడా ఆమెకు పేరు ఉంది. రక్షణ ఖర్చులను పెంచడం, జపాన్ సైన్యాన్ని బలోపేతం చేయడం, పాసిఫిస్ట్ రాజ్యాంగంలో మార్పులు చేయాలనే ఆలోచనలు ఆమె ప్రధాన అజెండాలో ఉన్నాయి. చైనాపై కఠిన వైఖరి, తైవాన్ భద్రతపై తకాయిచి స్పష్టమైన అభిప్రాయాలు వ్యక్తం చేయడం వల్ల ఆసియా రాజకీయాలు వేడెక్కాయి. అమెరికాతో సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తూ ఆర్థిక భద్రత, వ్యూహాత్మక భాగస్వామ్యంపై ఆమె దృష్టి పెట్టారు.

ఆర్థికంగా వినియోగ పన్ను తగ్గించడం, బడ్జెట్‌ను ఆమోదించడం వంటి నిర్ణయాలు తీసుకుంటూ దేశీయ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి తకాయిచి ప్రయత్నిస్తున్నారు. స్నాప్ ఎన్నికలు నిర్వహించి, LDPకు భారీ విజయాన్ని సాధించడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం ఆమె రెండో క్యాబినెట్‌ను ఏర్పాటు చేసి, రక్షణ వ్యూహాలు, ఆర్థిక సంస్కరణలపై దృష్టి కేంద్రీకరిస్తున్నట్టు సమాచారం.

Next Story