- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వీడీసీల ముసుగులో ఇసుక దందా..!
రాయికల్ మండల కేంద్రంలోని నదీ పరివాహక ప్రాంతాల నుంచి సెలవు రోజుల్లో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది.

దిశ, రాయికల్: రాయికల్ మండల కేంద్రంలోని నదీ పరివాహక ప్రాంతాల నుంచి సెలవు రోజుల్లో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. విలేజ్ డెవలప్మెంట్ కమిటీల పేరు చెప్పి సహజ వనరులను తరలించుకపోతున్నారు. మండలంలోని ఇటిక్యాల, బోర్నపల్లి నదీ పరివాహక ప్రాంతాల నుంచి ఇసుక పెద్ద ఎత్తున ఇతర ప్రాంతాలకు ట్రాన్స్ఫోర్ట్అవుతుంది. అయితే సెలవు రోజుల్లో సంబంధిత అధికారులు అందుబాటులో లేకపోవడంతో ఇసుక ఇల్లీగల్ ట్రాన్స్‌ఫోర్ట్ పగలు రాత్రి తేడా లేకుండా జరుగుతుంది. ట్రాక్టర్లలో పట్టపగలే ఇసుక తరలించడం ఒకెత్తయితే మైనర్లు ట్రాక్టర్లను డ్రైవ్ చేయడం మరింత ఆందోళన కలిగిస్తుంది. వీడీసీ ముసుగులో చేస్తున్న అక్రమ ఇసుక దందాకు అడ్డుకట్ట వేయడంతో పాటు మైనర్ డ్రైవింగ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
గ్రామాల్లో వీడీసీల ఆధిపత్యం..
రాయికల్ మండలంలోని చాలా గ్రామాలలో వీడీసీల ఆధిపత్యం ఎక్కువగా కనిపిస్తుంది.ఈ నేపథ్యంలో కొన్ని గ్రామాలలో వీడీసీ లు ఇష్టా రీతిన వ్యవహారిస్తున్నాయి. అడిగే వారు లేకపోవడంతో గ్రామభివృద్ధి కమిటీ ల పేరుతో డబ్బుకు కక్కుర్తి పడి గ్రామంలో లో గల సహజ వనరులను కొల్లగొడుతున్నారు. వీడీసీ పరిధిలో గల ఇసుక రీచుల నుంచి రవాణా చేస్తున్న ట్రాక్టర్ల యజమానుల నుంచి డబ్బులు తీసుకొని ఇసుక తవ్వకాలు, తరలింపునకు దగ్గరుండి మద్దతు పలుకుతున్నారు. ఇంతా జరుగుతున్న సంబంధిత అధికారులు మాత్రం చూసీ చూడనట్లు ఉంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
జేసీబీతో తవ్వకాలు.. ట్రాక్టర్, లారీల్లో సరఫరా..
వీడీసీల మద్దతుతో గోదావరి తీర ప్రాంతాల్లో ఏకంగా జేసీబీలతో ఇసుకను తోడుతూ ట్రాక్టర్లు, లారీల్లో తరలించుకుపోతున్నారు. మామూలు రోజుల్లో చీకటి అయితే ఇసుక తరలిస్తుండగా సెలవు రోజులు వారాంతాల్లో పగలు రాత్రీ తేడా లేకుండా ఇష్టం వచ్చినట్లు ఇసుక తరలిస్తున్నారు. ఓ వైపు ప్రభుత్వం, జిల్లా స్థాయి అధికారులు అక్రమ ఇసుక రవాణా కు అడ్డుకట్ట వేసేందుకు కృషి చేస్తుంటే స్థానికంగా ఉన్న కొందరు లోకల్ లీడర్ల అండ, వీడీసీ ల సహకారంతో ఈ దందా సాగుతున్నట్లు సమాచారం.
రాయికల్ కేంద్రంగా ఇసుక రవాణా..
రాయికల్ మండలంలోని ఇటిక్యాల,బోర్నపల్లి, జగన్నాథ్ పూర్‌తోపాటు మరికొన్ని గ్రామాల్లో నదీ పరివాహక ప్రాంతాల్లో నుంచి కొందరు ఇసుక వ్యాపారం చేసే వ్యక్తులు ఆయా శాఖల్లోని కొందరు అవినీతి అధికారులతో కుమ్మక్కై ఇసుక అక్రమ రవాణా కు పాల్పడుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. రాయికల్ నుంచి ఇబ్రహీంపట్నం, సారంగాపూర్, మెట్ పెల్లి, ఆర్మూర్, నిజామాబాద్ వంటి ప్రాంతాలకు నిత్యం లారీలలో తరలిస్తున్నట్లు స్థానిక గ్రామాల ప్రజలు చెబుతున్నారు. ఉన్నతాధికారులు అక్రమ ఇసుక రవాణా పట్ల ఉక్కు పాదం మోపడంతో పాటు అవినీతికి పాల్పడుతున్న వీడీసీలకు కళ్లెం వేయాలని ఆయా గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
అక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే చర్యలు తప్పవు: నాగార్జున, రాయికల్ ఎమ్మార్వో
అనుమతులు లేకుండా ఇసుక తవ్వినా, తరలించినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం. ఇసుకతో పాటు వాహనాలను సీజ్ చేసి జరిమానా విధిస్తాం. మైనర్లకు ట్రాక్టర్లు ఇస్తే యజమానులపై కేసులు నమోదు చేసేలా పోలీస్ శాఖకు సిఫారసు చేస్తామని రాయికల్ ఎమ్మార్వో నాగార్జున తెలిపారు.






