- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉప్పునుంతల దుందుభి వాగులో ఇసుక మాఫియా అక్రమ దందా!
అధికారుల అండతో ఉప్పునుంతలలో ఇసుక అక్రమ రవాణా. ఒక్కో ట్రాక్టర్‌కు రూ.15 వేల వసూళ్లు? రాత్రివేళల్లో యథేచ్ఛగా దోపిడీ. చర్యలకు ప్రజల డిమాండ్.

దిశ, ఉప్పునుంతల: తెలంగాణ ప్రభుత్వం సామాన్యులకు చౌకగా ఇసుకను అందించాలనే లక్ష్యంతో ‘మన ఇసుక - మన వాహనం’ పథకాన్ని ప్రవేశపెట్టినా, క్షేత్రస్థాయిలో కొందరు అధికారుల స్వార్థం వల్ల అది అక్రమార్కుల పాలిట వరంగా మారుతుంది. నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలంలోని దుందుభి వాగు పరివాహక ప్రాంతాలైన దాసర్లపల్లి, మొల్గర గ్రామాల్లో ఇసుక అక్రమ రవాణా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది.
అధికారుల అండదండలతో..
రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు కఠిన నిబంధనలు జారీ చేస్తున్నప్పటికీ మండల స్థాయిలో మాత్రం అవేవీ అమలు కావడం లేదు. ఇసుక మాఫియాతో చేతులు కలిపిన కొందరు అధికారులు దొంగలకు ‘సద్ది మోస్తున్న’ చందంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. రాత్రివేళల్లో అక్రమ రవాణాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ, లోపాయికారీ ఒప్పందాలతో వాగులను ఖాళీ చేస్తున్నారని విమర్శిస్తున్నారు.
ఒక్కో ట్రాక్టర్ కు రూ.15 వేలు మామూళ్లు..
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. రెండు రోజుల క్రితం రాత్రివేళ దాదాపు 20 ట్రాక్టర్లకు అధికారులు లైన్ క్లియర్ చేశారు. ఒక్కో ట్రాక్టర్ నుంచి సుమారు రూ. 15,000 చొప్పున వసూలు చేసి అక్రమ రవాణాకు సహకరించినట్లు మండల ప్రజలు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. గతంలోనూ మన ఇసుక పథకం కొద్ది రోజులు నడిచి ఆగడానికి ఇలాంటి అక్రమాలే కారణమని, ఇప్పుడు మళ్ళీ అదే తంతు కొనసాగుతోందని వారు మండిపడుతున్నారు. మొల్గర గ్రామానికి చెందిన 10 ట్రాక్టర్లు, కంసానిపల్లి గ్రామానికి చెందిన 10 ట్రాక్టర్లు మొత్తం 20 ట్రాక్టర్ల మేర మొల్గర దుందుభి నుంచి రాత్రిళ్ళు అక్రమ ఇసుక తరలించడానికి ఒప్పందాలు కుదిరినట్టు సమాచారం. అందులో భాగంగానే ఆదివారం మంచును కూడా లెక్క చేయకుండా రోడ్లపై ట్రాక్టర్లు పరుగులు పెడుతున్నాయని పలువురు చర్చించుకుంటున్నారు.
నిద్రలేని రాత్రులు.. నిమ్మకు నీరెత్తిన అధికారులు!
రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజాము వరకు ట్రాక్టర్లు వాగుల్లో నుంచి పరుగులు పెడుతుండటంతో గ్రామస్తులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఇసుక మాఫియా ఆగడాలపై ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోకపోవడం వెనుక పెద్ద ఎత్తున ముడుపుల వ్యవహారం దాగి ఉందని అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ దోపిడీలో అందరికీ భాగస్వామ్యం ఉందా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని, అక్రమ రవాణాకు చెక్ పెట్టాలని ఉప్పునుంతల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.






