- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మక్తల్‌లో రెచ్చిపోతున్న మట్టి మాఫియా !
అక్రమ ఇసుక రవాణాకు కేరాఫ్‌గా మారిన మక్తల్ నియోజకవర్గంలో ఇప్పుడు మట్టి మాఫియా చాపకింద నీరులా విస్తరిస్తోంది.

దిశ, మక్తల్: అక్రమ ఇసుక రవాణాకు కేరాఫ్‌గా మారిన మక్తల్ నియోజకవర్గంలో ఇప్పుడు మట్టి మాఫియా చాపకింద నీరులా విస్తరిస్తోంది. మక్తల్–నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకం పనుల్లో భాగంగా కాలువల తవ్వకాల ద్వారా వెలికితీసిన మట్టిని కొందరు అక్రమార్కులు ఎలాంటి అనుమతులు లేకుండానే భారీ ఎత్తున తరలిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండికొడుతూ, రాత్రి వేళల్లో టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా మట్టిని తరలిస్తూ లక్షల రూపాయలు ఆర్జిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు.
కాలువ తవ్వకాలతో కాసుల వర్షం!
మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భాగంగా నియోజకవర్గంలో ప్రస్తుతం కాలువల తవ్వకం పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ తవ్వకాల్లో వస్తున్న నాణ్యమైన మట్టిపై మాఫియా కన్ను పడింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మైనింగ్, భూగర్భ వనరుల శాఖకు నిర్ణీత రుసుము చెల్లించి, ముందస్తు అనుమతులు పొందితే తప్ప ఈ మట్టిని తరలించడానికి వీల్లేదు. కానీ, ఈ అక్రమార్కులకు అవేమీ పట్టవు. ఎలాంటి పర్మిషన్లు లేకుండానే జేసీబీలతో తోడేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
చీకటి పడితే టిప్పర్ల జాతర..
పగటిపూట కాస్త నిశ్శబ్దంగా ఉండే ప్రాజెక్టు ప్రాంతాలు, చీకటి పడగానే టిప్పర్లు, ట్రాక్టర్ల శబ్దాలతో హోరెత్తిపోతున్నాయి. ఒక్కో టిప్పర్ మట్టిని డిమాండ్‌ను బట్టి రూ. 15,000 నుంచి రూ. 25,000 వరకు విక్రయిస్తున్నట్లు బహిరంగంగానే ప్రచారం జరుగుతోంది. రాత్రికి రాత్రే వందలాది ట్రిప్పుల మట్టిని గుట్టుచప్పుడు కాకుండా తరలించి మార్కెట్లో విక్రయిస్తున్నారు.
మేము ఆ నేత బంధువులం...
ఎలాంటి అనుమతులు లేకుండా ఇంత పెద్ద ఎత్తున దందా సాగిస్తున్న అక్రమార్కులకు రాజకీయ అండదండలు పుష్కలంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో ఎవరైనా స్థానికులు, రాజకీయ కార్యకర్తలు ప్రశ్నిస్తే.. ‘మేము అధికార పార్టీకి చెందిన ముఖ్య నాయకుడి బంధువులం.. అనుచరులం’ అంటూ బుకాయిస్తున్నారు. చివరకు నిలదీయడానికి వెళ్లే కిందిస్థాయి అధికారులను సైతం సదరు కీలక నేత పేరు చెప్పి బెదిరిస్తున్నట్లు సమాచారం. ఆ నేత అండ చూసుకునే మాఫియా శక్తులు బరితెగించి ప్రాజెక్టు మట్టిని దోచేస్తున్నాయని స్థానికులు మండిపడుతున్నారు.
చేతులెత్తేసిన యంత్రాంగం..
అక్రమ ఇసుక, మట్టి రవాణాను అడ్డుకోవడంలో నియోజకవర్గ అధికార యంత్రాంగం పూర్తిగా చేతులెత్తేసిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మాఫియా ఆగడాలు కళ్లముందే కనిపిస్తున్నా, రాజకీయ ఒత్తిళ్ల కారణంగా అధికారులు కన్నెత్తి చూడటం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. గత కొన్ని రోజులుగా యథేచ్ఛగా సాగుతున్న ఈ అక్రమ దందా పై ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించాల్సి ఉంది. క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు.






