మృత్యుశకటాల్లా ఇసుక లారీలు..

by Batti.Sumithra |

కొమరం భీమ్ జిల్లా కాగజ్‌నగర్‌లో ఇసుక లారీలు మృత్యుశకటాల్లా విహరిస్తున్నాయి.

మృత్యుశకటాల్లా ఇసుక లారీలు..
X

దిశ, కాగజ్‌నగర్: కొమరం భీమ్ జిల్లా కాగజ్‌నగర్‌లో ఇసుక లారీలు మృత్యుశకటాల్లా విహరిస్తున్నాయి. కాగజ్‌నగర్ మీదుగా ఎక్స్ రోడ్ వైపు వెళ్లే మార్గంలో ఇసుక లారీల నిర్వాహకులు కనీస బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లారీలను పూర్తిగా ఇసుకతో నింపి, పైన ఎలాంటి తర్పాలిన్ కవర్ కప్పకుండా అత్యంత ప్రమాదకర రీతిలో వేగంగా నడుపుతున్నారు. లారీ వేగానికి ఇసుక రేణువులు గాలిలోకి ఎగిరి రోడ్డు పై ప్రయాణిస్తున్న ఇతర వాహనదారుల పై పడుతున్నాయి. ముఖ్యంగా ద్విచక్ర వాహనాల పై ప్రయాణించే వారి కళ్లలో ఇసుక పడటంతో చూపు మందగించి, వాహనాలు అదుపుతప్పి ప్రమాదాల బారిన పడే పరిస్థితులు నెలకొంటున్నాయి.

దర్జాగా నిబంధనల ఉల్లంఘన..

సదరు లారీ వెనుక భాగంలో కనీసం నంబర్ ప్లేట్ కూడా లేకపోవడం గమనార్హం. నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను తరలిస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడం పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నంబర్ ప్లేట్ లేని వాహనాలు దర్జాగా రోడ్డు పై తిరుగుతున్నాయంటే అధికారుల పర్యవేక్షణ ఎంత బలహీనంగా ఉందో అర్థమవుతోందని స్థానికులు మండిపడుతున్నారు.

ప్రమాదం జరిగితేనే నిబంధనలు గుర్తుకొస్తాయా..?

ఏదైనా పెద్ద ప్రమాదం జరిగి ప్రాణనష్టం సంభవించిన తర్వాతే అధికారులు స్పందిస్తారా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న లారీ యజమానులు, డ్రైవర్ల పై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని, తనిఖీలు ముమ్మరం చేసి తర్పాలిన్ కవర్ లేకుండా, నంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతున్న ఇలాంటి లారీలను సీజ్ చేయాలని కాగజ్‌నగర్ ప్రజలు ఉన్నతాధికారులను డిమాండ్ చేస్తున్నారు.

Next Story