ఆర్ అండ్ ఆర్ లేకుండానే భూముల స్వాధీనం..!

by Kodari Anjali |

డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మాణంలో ఉన్న లక్ష్మణపురం ప్రాజెక్టు పనుల కోసం అధికారులు పంట భూములను బలవంతంగా స్వాధీనం చేసుకుంటున్నారని రైతుల్లో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆర్ అండ్ ఆర్ లేకుండానే భూముల స్వాధీనం..!
X

దిశ, నాంపల్లి: మండలంలోని లక్ష్మణపురం గ్రామంలో డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మాణంలో ఉన్న లక్ష్మణపురం ప్రాజెక్టు పనుల కోసం అధికారులు పంట భూములను బలవంతంగా స్వాధీనం చేసుకుంటూ, సాగులో ఉన్న పంటలను ధ్వంసం చేయడం రైతుల్లో తీవ్ర ఆందోళనకు దారితీసింది. ఆర్ అండ్ ఆర్ (రీహాబిలిటేషన్ అండ్ రీసెట్టిల్మెంట్) ప్యాకేజీ పూర్తిగా అమలు చేయకుండానే భూములను ఆక్రమించడం చట్టవిరుద్ధమని నిర్వాసితులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పదేళ్లుగా ఆర్ అండ్ ఆర్ కోసం ఎదురుచూపు

దాదాపు పదేళ్లుగా "ఇదిగో.. అదిగో.." అంటూ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అమలులో ప్రభుత్వం కాలయాపన చేస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం 2013 భూ సేకరణ చట్టం ప్రకారం భూమికి భూమి, ఇల్లుకు ఇల్లు, చెట్టుకు చెట్టు ఇస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఎకరాకు రూ.4.15 లక్షలకే తమ భూములను అప్పగించారని గుర్తుచేస్తున్నారు. అయితే ఇప్పటికీ 18 సంవత్సరాలు నిండిన సుమారు 20 మంది నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్రయోజనాలు అందలేదని, ప్లాట్లు కూడా కేటాయించలేదని భూ నిర్వాసితులు గడ్డి యాదయ్య చెబుతున్నారు.

గ్రామంలోనే పంట భూములు సాగు

ప్రస్తుతం గ్రామంలోనే ఉంటూ తమ మిగిలిన భూముల్లో వ్యవసాయం చేస్తున్న రైతులు ఈ ఏడాది తొలకరి వర్షాలకు పత్తి పంట సాగు చేశారు. బోర్లు ఉన్న రైతులు పంట కోసం వరి నారుకూడా పోశారు. అయితే గత రెండు రోజులుగా అధికారులు పోలీసు బందోబస్తుతో పంటలను పూర్తిగా ధ్వంసం చేసి మట్టిని తరలించే పనులు చేపట్టారని రైతులుకన్నీరుమున్నీరవుతున్నారు. రైతులు ఎంత వేడుకున్నా కనికరించకుండా పంటలను ధ్వంసం చేస్తూ మట్టిని ఎత్తుతున్నారు.

పునరావాసం కల్పించిన తర్వాతే ఖాళీ చేస్తాం

"ముందుగా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ, ప్లాట్లు కేటాయించి, పునరావాసం కల్పించిన తర్వాత గ్రామాన్ని ఖాళీ చేసి వెళ్తాం. అప్పటి వరకు మా పంటలను నాశనం చేయవద్దని వేడుకున్నా అధికారులు వినిపించుకోకుండా పోలీసులతో బలవంతంగా పంటలను ధ్వంసం చేశారు" అని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. భూసేకరణ చట్టం ప్రకారం తమకు రావలసిన ప్యాకేజీ పూర్తిగా అందిన తర్వాతనే తాము గ్రామాన్ని ఖాళీ చేస్తామని భూ నిర్వాసితులు పేర్కొంటున్నారు. లక్ష్మణపురం ప్రాజెక్టు పరిధిలో భూములు కోల్పోయిన రైతులందరికీ 2013 భూ సేకరణ చట్టం ప్రకారం రావాల్సిన ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ, ప్లాట్లు, ఇతర అన్ని ప్రయోజనాలను వెంటనే అందించి భూనిర్వాసులకు న్యాయం చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి రైతులకు న్యాయం చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Next Story