రాజ్యాంగ స్ఫూర్తితోనే పనిచేశా: హైకోర్టు తీర్పుపై ‘హైడ్రా’ చీఫ్ రంగనాథ్

by Kema Shiva Kumar |   (  Updated:2026-07-27 16:00:45  IST  )

‘హైడ్రా’ కమిషనర్‌గా తప్పించాలన్న హైకోర్టు ఆదేశాలపై ఏవీ రంగనాథ్ స్పందించారు.

రాజ్యాంగ స్ఫూర్తితోనే పనిచేశా: హైకోర్టు తీర్పుపై ‘హైడ్రా’ చీఫ్ రంగనాథ్
X

దిశ, వెబ్‌డెస్క్: ‘హైడ్రా’ కమిషనర్‌గా రంగనాథ్‌ను తప్పించాలని తెలంగాణ హైకోర్టు ప్రధాన ప్రభుత్వ కార్యదర్శికి సంజయ్ జాజుకు సంచలన ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిందే. ఈ నేపథ్యంలో హైకోర్టు ధర్మాసనం తీర్పుపై తాజాగా ఏవీ రంగనాథ్ రియాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాము పూర్తిగా రాజ్యాంగ స్ఫూర్తితోనే పనిచేశామని, చెరువులు, ప్రభుత్వం ఆస్తులు కాపాడటమే హైడ్రా లక్ష్యమని అన్నారు. ఇప్పటి వరకు రూ.1.50 లక్షల కోట్ల ప్రభుత్వం ఆస్తులను పరిరక్షించామని గుర్తు చేశారు. దాదాపు 6 చెరువులను పూర్తిగా పునరుద్ధరించామని అన్నారు. మరో 20 చెరువుల పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. వేల ఎకరాల కబ్జా భూములను వెనక్కి తీసుకుని, తిరిగి ప్రభుత్వానికి అప్పగించిందని పేర్కొన్నారు. అదేవిధంగా లోతుకుంటలో భూ కబ్జా యత్నాన్ని అడ్డుకున్నామని అన్నారు. కానీ, ల్యాండ్ మాఫియా కోర్టును తప్పుదోవ పట్టిస్తోందని, తనపై ఉన్న కోర్టు ధిక్కార నోటీసులన్నీ భూ కబ్జాదారులవేనని తెలిపారు. ఏది ఏమైనా అన్ని కేసులను చట్టపరంగానే ఎదుర్కొనేందుకు సిద్ధమని అన్నారు. తనకు న్యాయ వ్యవస్థపై పూర్తి నమ్మకం ఉందని రంగనాథ్ స్పష్టం చేశారు.

Next Story