ఉత్తర తెలంగాణ అభివృద్ధికి ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ మైలురాయి: పాయల్ శంకర్

by Ramesh Naini |

ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ మంజూరు ఉమ్మడి ఉత్తర తెలంగాణ అభివృద్ధికి కీలక మలుపుగా మారనుందని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు.

ఉత్తర తెలంగాణ అభివృద్ధికి ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ మైలురాయి: పాయల్ శంకర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ మంజూరు ఉమ్మడి ఉత్తర తెలంగాణ అభివృద్ధికి కీలక మలుపుగా మారనుందని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతోనే ఈ ప్రాజెక్టు సాధ్యమైందన్నారు. ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.2,278 కోట్లు కేటాయించగా, రక్షణ శాఖ మరో రూ.3,000 కోట్లు వెచ్చించనుందని తెలిపారు. మొత్తం సుమారు రూ.5,500 కోట్లతో రక్షణ శాఖ, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా భాగస్వామ్యంలో జాయింట్ యూజర్ ఎయిర్‌పోర్ట్‌గా ఇది అభివృద్ధి చెందుతుందన్నారు.

హైదరాబాద్ తర్వాత రాష్ట్రంలోనే అతిపెద్ద ఇండస్ట్రియల్ పార్క్‌ను ఆదిలాబాద్‌లో ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే 2,200 ఎకరాల భూసేకరణకు జీవో జారీ కాగా, మరో 6 వేల ఎకరాల సేకరణ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ఎయిర్‌పోర్ట్, ఇండస్ట్రియల్ కారిడార్‌తో ఆదిలాబాద్ జాతీయ లాజిస్టిక్స్ హబ్‌గా, కార్గో కేంద్రంగా ఎదిగే అవకాశముందని చెప్పారు. దీంతో టెక్స్‌టైల్, ఆగ్రో ప్రాసెసింగ్, పర్యాటకం, గిరిజన నైపుణ్యాభివృద్ధి వంటి రంగాలకు ఊతం లభిస్తుందన్నారు. ఎయిర్‌పోర్ట్ మంజూరుకు సహకరించిన ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్, రామ్మోహన్ నాయుడు, రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాయల్ శంకర్ కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో ప్రధాని మోడీ చేతుల మీదుగా ఎయిర్‌పోర్ట్ శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

Next Story