ఉగాది నాటికి సనత్‌నగర్ టిమ్స్ ప్రారంభం

by Muthe.Rajitha |

ఉగాది నాటికి సనత్‌నగర్ టిమ్స్ ప్రారంభం అవుతుందని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు.

ఉగాది నాటికి సనత్‌నగర్ టిమ్స్ ప్రారంభం
X

దిశ, తెలంగాణ బ్యూరో: పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా నిర్మిస్తున్న సనత్‌నగర్ టిమ్స్ (తెలంగాణ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) ఆసుపత్రిని రాబోయే ఉగాది నాటికి పూర్తిస్థాయిలో సిద్ధం చేయాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. మంగళవారం మంత్రి సనత్‌నగర్ టిమ్స్ ఆసుపత్రి పనులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. అనంతరం ఎమర్జెన్సీ బ్లాక్‌లో మెడికల్, ఫైర్, పొల్యూషన్ కంట్రోల్, వాటర్, ఎలక్ట్రిసిటీ, ఆర్ అండ్ బీ తదితర శాఖల ఉన్నతాధికారులతో కలిసి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా హాస్పిటల్ కు విద్యుత్, నీటి సరఫరాలో ఎలాంటి ఆటంకాలు ఉండకూడదని, 24 గంటల పాటు నిరంతర సరఫరా ఉండేలా పక్కా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఫైర్ సేఫ్టీ విషయంలో రాజీ ఉండకూడదని, ప్రతి ఫ్లోర్‌లో పూర్తిస్థాయిలో తనిఖీలు నిర్వహించి ఫైర్ క్లియరెన్స్ తీసుకోవాలని అగ్నిమాపక శాఖ అధికారులను ఆదేశించారు.

ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సీటీ స్కాన్, ఎంఆర్‌ఐ, ఎక్స్ రే, ఆల్ట్రాసౌండ్ వంటి అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ యంత్రాలను మంత్రి పరిశీలించారు. ఈ యంత్రాలు రోగులకు అందుబాటులోకి రావాలని, వీటి నిర్వహణకు అవసరమైన డాక్టర్లు, టెక్నీషియన్లను సిద్ధం చేయాలని ఆదేశించారు. రిసెప్షన్, హెల్ప్ డెస్క్, ఓపీ కౌంటర్లు,వెయిటింగ్ హాల్, ఓపీ కన్సల్టేషన్ రూమ్స్, డయాగ్నస్టిక్స్, ఇన్ పేషెంట్ వార్డులు, ఫార్మసీలను మంత్రి తనిఖీ చేశారు. రోగుల రద్దీకి అనుగుణంగా ఓపీ, ఫార్మసీ కౌంటర్లు తగినన్ని ఉండాలని సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో ఆర్ అండ్ బీ స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తు, పీసీబీ మెంబర్ సెక్రటరీ రవి, వాటర్ బోర్డు జేఎండీ మయాంక్ మిట్టల్, డీఎంఈ నరేంద్ర కుమార్, నిమ్స్ డైరెక్టర్ బీరప్ప తదితరులు పాల్గొన్నారు.

Next Story