గ్రూప్-1‌పై నియామకాలపై అదే సస్పెన్స్.. హైకోర్టు తీర్పు వాయిదా

by Kema Shiva Kumar |   (  Updated:2026-01-22 05:29:33  IST  )

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-1 నియామకాలపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.

గ్రూప్-1‌పై నియామకాలపై అదే సస్పెన్స్.. హైకోర్టు తీర్పు వాయిదా
X

దిశ, వెబ్‌డెస్క్: గ్రూప్‌-1 నియామకాలపై తెలంగాణ హైకోర్టు తీర్పును వాయిదా వేసింది. వచ్చే నెల 5న తుది తీర్పు వెల్లడించనున్నట్లుగా ధర్మాసనం తెలిపింది. అయితే కేసుకు సంబంధించి తీర్పు కాపీ ఇంకా సిద్ధం కాలేదని న్యాయవాదులకు డివిజన్‌ బెంచ్‌ సమాచారం ఇచ్చింది. దీంతో ఫిబ్రవరి 5న కేసులో తుది తీర్పు వెలువడనుంది. కాగా, గ్రూప్-1 పరీక్షల నిర్వహణ, కరెక్షన్, బయోమెట్రిక్ నిబంధనల అమలులో లోపాలు ఉన్నాయంటూ పలువురు అభ్యర్థులు గతంలో హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన సింగిల్ బెంచ్, గ్రూప్-1 ఫలితాలను రద్దు చేస్తూ సంచలన తీర్పునిచ్చింది. అంతేకాకుండా, జవాబు పత్రాలను తిరిగి మూల్యాంకనం చేయాలని లేదా అవసరమైతే పరీక్షను మళ్లీ నిర్వహించాలని ఆదేశిస్తూ అప్పట్లో నియామకాలపై స్టే విధించింది.

అనంతరం సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC), ఎంపికైన అభ్యర్థులు డివిజన్ బెంచ్‌లో అప్పీల్ చేశారు. ఈ క్రమంలోనే ప్రధాన న్యాయమూర్తి (CJ) ధర్మాసనం సింగిల్ బెంచ్ ఇచ్చిన స్టేను ఎత్తివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్రభుత్వం వేగంగా స్పందించి, ఎంపికైన 562 మంది అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేసింది. అయితే, ఈ నియామకాలు కోర్టు ఇచ్చే తుది తీర్పునకు లోబడి ఉంటాయని ధర్మాసనం అప్పుడే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పటికే ఉద్యోగాల్లో చేరిన అభ్యర్థుల నియామకాలు సుస్థిరం అవుతాయా..? మూల్యాంకనం, బయోమెట్రిక్ ఓఎంఆర్ షీట్లపై వచ్చిన ఆరోపణలను కోర్టు పరిగణనలోకి తీసుకుంటుందా అనే విషయం 562 మంది గ్రూప్-2 అభ్యర్థుల భవితవ్యంతో ముడిపడి ఉంది.

Read More..

గ్రూప్-1 అభ్యర్థుల భవితవ్యంపై ఉత్కంఠ.. కాసేపట్లో హైకోర్టు డివిజన్ బెంచ్ కీలక తీర్పు

Next Story