మహిళలు స్కూటీలు, గొలుసులు తీసుకెళ్లండి అన్న మాటకు కట్టుబడి ఉన్నా

by Ratna Kumari |   (  Updated:2026-07-21 16:25:47  IST  )

మహిళలు, చదువుకునే యువతులు కాంగ్రెస్ నాయకుల స్కూటీ షోరూంల నుంచి స్కూటీలు, వారి మెడల్లోని బంగారు గొలుసులు తీసుకెళ్లాలని గతంలో చేసిన వ్యాఖ్యలకు తాను ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు.

మహిళలు స్కూటీలు, గొలుసులు తీసుకెళ్లండి అన్న మాటకు కట్టుబడి ఉన్నా
X

దిశ, ఆర్మూర్ : మహిళలు, చదువుకునే యువతులు కాంగ్రెస్ నాయకుల స్కూటీ షోరూంల నుంచి స్కూటీలు, వారి మెడల్లోని బంగారు గొలుసులు తీసుకెళ్లాలని గతంలో చేసిన వ్యాఖ్యలకు తాను ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజకీయాల్లోకి వచ్చి ఆస్తులు పెంచుకోవాలనే ఉద్దేశంతో తాను రాలేదని, ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలకు సాధ్యమైనంత సేవ చేయాలనే లక్ష్యంతోనే ప్రజా జీవితంలోకి వచ్చానని తెలిపారు. గడిచిన మూడు సంవత్సరాల్లో తాను నయాపైసా కూడా అవినీతికి పాల్పడలేదని పేర్కొంటూ, దీనిపై కాంగ్రెస్ నాయకులు దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ నేత మహేష్ కుమార్ గౌడ్ రాజకీయ ప్రయోజనాల కోసమే తనపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని, అదే విధంగా తాను ఆర్మూర్‌లో చేపట్టిన అభివృద్ధి పనులపై కూడా అదే జడ్జితో విచారణ నిర్వహించాలని కోరారు. అప్పుడు ఎవరు నిజాయితీగా పనిచేశారో, ఎవరు తప్పు చేశారో ప్రజలకు స్పష్టమవుతుందని అన్నారు. అవసరమైతే అనంతరం ఏసీబీ వంటి దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని సూచించారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వం రాజకీయ ప్రసంగాలతో కాలం గడుపుతోందని విమర్శించారు. అధికార పార్టీ నాయకులు ప్రతిపక్ష నేతల ఇళ్ల ముట్టడికి ప్రోత్సాహం ఇవ్వడం రాజ్యాంగ విలువలకు విరుద్ధమని అన్నారు. తనకు ఎవరిపైనా వ్యక్తిగత కక్షలు లేవని, అయితే ఇంటి వరకు వచ్చి ఇబ్బందులు కలిగిస్తే సహించబోనని స్పష్టం చేశారు. అభివృద్ధి అంశాలపై ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్ధమని, రాష్ట్ర‌ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ముందుకు వస్తే చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి తెలిపారు.

Next Story