- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పగటి పూట సోలార్ వినియోగంతో ఆర్థిక భారం తగ్గుతుంది: భట్టి విక్రమార్క
రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావం వ్యవసాయం, తాగునీరు, విద్యుత్ రంగాలపై ప్రభావం చూపకుండా ప్రభుత్వం పక్కా ప్రణాళికలు రూపొందిస్తోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. మంగళవారం రవీంద్రభారతిలో ప్లానింగ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి అవగాహన సదస్సుకు మంత్రి మహమ్మద్ అజారుద్దీన్‌తో కలిసి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావం వ్యవసాయం, తాగునీరు, విద్యుత్ రంగాలపై ప్రభావం చూపకుండా ప్రభుత్వం పక్కా ప్రణాళికలు రూపొందిస్తోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. మంగళవారం రవీంద్రభారతిలో ప్లానింగ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి అవగాహన సదస్సుకు మంత్రి మహమ్మద్ అజారుద్దీన్‌తో కలిసి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎల్ నినోపై ప్రజలకు పూర్తిస్థాయి అవగాహన కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి కుటుంబం, ప్రతి గ్రామం సొంతంగా సరైన ప్రణాళికలు వేసుకోగలుగుతుందన్నారు. పసిఫిక్ మహాసముద్రంలో జరిగే ఉష్ణోగ్రతల మార్పులు తెలంగాణలోని చెరువులు, వాగులు, గ్రామాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో శాస్త్రవేత్తల ద్వారా విశ్లేషింపజేసి కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. తాగునీరు, సాగునీటితో పాటు పశువులు, పక్షులు, అడవి జంతువుల నీటి, ఆహార అవసరాలకు ఇబ్బంది కలగకుండా ముందస్తు ప్రణాళికలు చేస్తున్నామన్నారు.
వర్షాభావ పరిస్థితులు ఎదురైనా రైతులు ఆర్థికంగా నష్టపోకుండా ఉండేందుకు నిపుణుల సూచనల మేరకు తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటల విధానాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. ఈ సమాచారాన్ని ప్రత్యక్ష ప్రసారాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటికీ తీసుకెళ్లడంలో టీవీ ఛానెళ్లు తమ సామాజిక బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నాయని అభినందించారు. మన జీవన విధానంలో విద్యుత్ ప్రధానమైనదని, ఎల్ నినో వల్ల పెరిగిన డిమాండ్‌ను తట్టుకునేందుకు ప్రభుత్వం ఎనర్జీ మేనేజ్‌మెంట్ అమలు చేస్తోందన్నారు. పగటి పూట విరివిగా, తక్కువ ధరకు లభించే సౌర విద్యుత్‌ను (సోలార్ పవర్) గరిష్టంగా వినియోగించుకోవడం ద్వారా ప్రజలపై, ప్రభుత్వంపై ఆర్థిక భారం తగ్గుతుందన్నారు. సోలార్ సమయాన్ని సమర్థవంతంగా వాడుకుంటూ, తదుపరి అవసరాలకు థర్మల్ విద్యుత్‌ను క్రమబద్ధంగా వినియోగించడం ద్వారా గ్రిడ్ స్థిరత్వాన్ని కాపాడుతున్నామన్నారు.
వర్షాకాలంలో వేసవి కాలం స్థాయి విద్యుత్‌డిమాండ్ :
ఉష్ణోగ్రతలు పెరగడంతో పగలు, రాత్రి అనే తేడా లేక ఫ్యాన్లు, ఏసీలు, లైట్లు, బోర్‌వెల్స్, లిఫ్ట్ ఇరిగేషన్ మోటార్ల వాడకం భారీగా పెరిగిందన్నారు. సాధారణంగా వర్షాకాలంలో విద్యుత్ డిమాండ్ తక్కువగా ఉంటుంది, కానీ ఎల్ నినో ప్రభావంతో తెలంగాణలో ప్రస్తుత డిమాండ్ ఏప్రిల్ నాటి గరిష్ట స్థాయికి చేరుకుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న సీజన్లకు అనుగుణంగా విద్యుత్ వినియోగంలో మార్పులు వస్తున్నాయని, పెరిగిన అవసరాలకు తగ్గట్టుగా ఎనర్జీ ప్లానింగ్ రూపొందించుకోవడంలో తెలంగాణ ముందుంటుందని తెలిపారు. ఏసీలు, ఫ్యాన్లు, మోటార్ల వాడకంలో వస్తున్న మార్పులను దృష్టిలో ఉంచుకుని వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ను అందించడమే ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు.
సమాజంలో చైతన్యం తీసుకురావడానికి విషయ నిపుణులను ఆహ్వానించి ఈ సదస్సును ఏర్పాటు చేసిన ప్లానింగ్ శాఖను ఉప ముఖ్యమంత్రి అభినందించారు. ఇటువంటి అవగాహన సదస్సులను భవిష్యత్తులో జిల్లాల వారీగా కూడా నిర్వహించి ప్రజలను భాగస్వాములను చేస్తూ పూర్తి స్థాయి చైతన్యం తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. పాలనాధికారులు తమ విధులతో పాటు సమాజానికి మేలు చేసే ఇటువంటి అంశాలలో ప్రజలను చైతన్యవంతం చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎనర్జీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ నవీన్ మిట్టల్, ప్లానింగ్ సెక్రెటరీ గౌరవ ఉప్పల్, ఐఏఎస్ అధికారులు దివ్య దేవరాజన్, గోపి, జితేష్ వి పాటిల్ ప్లానింగ్ డైరెక్టర్ రూఫొస్ దత్తం తదితరులు పాల్గొన్నారు.






