GST స్లాబులతో తగ్గిన సేల్స్ ట్యాక్స్.. భారీగా పెరిగిన రిజిస్ట్రేషన్ల ఆదాయం

by Kema Shiva Kumar |   (  Updated:2026-01-17 04:02:31  IST  )

రాష్ట్ర ఆదాయం క్రమ క్రమంగా మెరుగవుతోంది. గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి వివిధ పన్నుల ద్వారా వచ్చే ఆదాయంలో పెరుగుదల నమోదైంది.

GST స్లాబులతో తగ్గిన సేల్స్ ట్యాక్స్.. భారీగా పెరిగిన రిజిస్ట్రేషన్ల ఆదాయం
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ఆదాయం క్రమ క్రమంగా మెరుగవుతోంది. గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి వివిధ పన్నుల ద్వారా వచ్చే ఆదాయంలో పెరుగుదల నమోదైంది. ముఖ్యంగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లు, స్టేట్ ఎక్సైజ్, నాన్ టాక్స్ రెవెన్యూ ఆదాయం పెరిగినట్లుగా కాగ్ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. అయితే జీఎస్టీ స్లాబులను తగ్గించడంతో సేల్స్ ట్యాక్స్ ద్వారా వచ్చే ఆదాయం తగ్గింది. శుక్రవారం 2025 డిసెంబర్ నెలకు సంబంధించిన తెలంగాణ ఆదాయం, వ్యయాలకు సంబంధించిన వివరాలను కాగ్ ప్రకటించింది. ఇందులో రెవెన్యూ రిసిప్టుల ద్వారా వచ్చే ఆదాయం గత సంవత్సరానికి కంటే రూ.12 వేల కోట్లు పెరిగింది. నిర్ధేశించుకున్నలక్ష్యంలో ఇప్పటి వరకు 54.38 శాతం లక్ష్యాన్ని చేరుకుందని తెలిపింది. అయితే 2024–25 ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ నాటికి 50.76 శాతం మాత్రమే చేరుకొని రూ.1,12,307 కోట్ల ఆదాయం వచ్చింది. గత డిసెంబర్ వరకు రూ.1,24,911 కోట్ల ఆదాయం వచ్చింది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ద్వారా రూ.11,304 కోట్లు వచ్చాయని, ఇది అనుకున్న లక్ష్యంలో 59.22 శాతం కాగా గత ఆర్ధిక సంవత్సరంలో ఇది కేవలం రూ.7524 కోట్లు మాత్రమేనని కాగ్ తెలిపింది.

ఇక గ్రామ పంచాయతీ ఎన్నికలు, కొత్త మద్యం షాపులు ప్రారంభం కావడం తదితర కారణాలతో ఎక్సైజ్ ఆదాయం రూ.17507 కోట్లకు చేరింది. గత సంవత్సరంలో రూ.14708 కోట్ల ఆదాయం వచ్చింది. గత సంవత్సరంతో పొలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 8.42 శాతం అధికంగా ఉంది. నాన్ ట్యాక్స్ రెవెన్యూలో గతేడాది కంటే 6.93 శాతం అధికంగా ఆదాయం వచ్చింది. రూ.7120 కోట్ల ఆదాయం వచ్చింది. భూముల అమ్మకాల ద్వారా ఆదాయం వచ్చింది. సేల్స్ టాక్స్ ద్వారా రూ.25126 కోట్ల ఆదాయం వచ్చింది. అభివృద్ధి కార్యక్రమాలను చూపించే సూచికగా భావించే మూలధనవ్యయాన్ని భారీగా ఖర్చు చేసింది. ఇప్పటి వరకు రూ.42691 కోట్లను కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చు చేసిందని, అయితే బడ్జెట్ లో పెట్టిన దాని కంటే ఇప్పటికే అధికంగా మరో రూ.6వేల కోట్లు డిసెంబర్ నాటికే ఖర్చు చేసిందని తెలిపింది. దీంతో రాష్ట్రంలో అభివృద్ధి పనులకు అధికంగా నిధులు వెచ్చిస్తుందని లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటి వరకు 116 శాతం నిధులను క్యాపిటల్ వ్యయాన్ని వెచ్చించారు. అదే సమయంలో అప్పులను కూడా గత యేడాది కంటే అధికంగానే తీసుకున్నారు. ఇప్పటి వరకు రూ.65,930 కోట్లు అప్పులు తీసుకువచ్చినట్లుగా కాగ్ తెలిపింది.

Read More..

తెలుగు రాష్ట్రాల మధ్య జల ‘జగడం’.. పరిష్కారానికి కేంద్రం కమిటీ ఏర్పాటు

Next Story