సజ్జనార్ కాంగ్రెస్ కండువా కప్పుకోవాలి.. హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు

by Malleboina Mahesh |   (  Updated:2026-01-14 12:54:14  IST  )

రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖూనీ చేస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

సజ్జనార్ కాంగ్రెస్ కండువా కప్పుకోవాలి.. హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖూనీ చేస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు (MLA Harish Rao) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హైదరాబాద్‌లోని ఎన్టీవీ (NTV) కార్యాలయంలో పోలీసుల సోదాలను ఈ సందర్భంగా ఆయన తీవ్రంగా ఖండించారు. ఎన్టీవీ భుజంపై తుపాకీ పెట్టి రాష్ట్రంలోని మీడియా మొత్తాన్ని రేవంత్ రెడ్డి భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, జర్నలిస్టులను అర్ధరాత్రి అరెస్ట్ చేసి వికృతానందం పొందుతున్నారని మాజీ మంత్రి ధ్వజమెత్తారు. అసలు అరెస్ట్ చేసిన జర్నలిస్టులేమైనా టెర్రరిస్టులా అని ఆయన ప్రశ్నించారు. ఈ రకమైన బ్లాక్‌మెయిల్ రాజకీయాలు ప్రజాస్వామ్యానికి ఏమాత్రం మంచిది కాదని హరీష్ రావు హెచ్చరించారు.

పోలీసుల తీరుపై కూడా హరీష్ రావు ఘాటుగా స్పందిస్తూ.. నగర సీపీ సజ్జనార్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సజ్జనార్ పోలీస్ యూనిఫామ్ తీసేసి కాంగ్రెస్ కండువా కప్పుకోవాలని, ఆయన తీరు అధికార పార్టీ కార్యకర్తలా ఉందని హరీష్ విమర్శించారు. గతంలో మంత్రి కొండా సురేఖ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు చట్టం ఏమైందని ఆయన నిలదీశారు. ఆ రోజు కూడా బాధితురాలు మహిళేనని, కానీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్లే కేటీఆర్ కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చిందని గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మీడియాను తన గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తున్నారని, ఇలాంటి దాడులకు బీఆర్‌ఎస్ భయపడబోదని హరీష్ రావు స్పష్టం చేశారు.

అలాగే పోలీసులతో బెదిరించి ప్రశ్నించకుండా చేస్తున్నారని.. మీడియా ప్రశ్నించడం మానేస్తే అధికారంలో ఉన్నవాళ్లు బరితెగిస్తారని, ప్రజల గొంతుక లేకుండా పోతోందని, జర్నలిస్టులను చూస్తే చెంప పగలగొట్టాలని అనిపిస్తోందని ఓసారి సీఎం రేవంత్‌ అన్నారని, ప్రశ్నించే హక్కు ఇస్తున్నామని చెప్పి.. అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ ప్రభుత్వం ఎమర్జెన్సీ పాలనను తలపిస్తున్నారని మాజీ మంత్రి హరీష్‌రావు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.

Read More... Sajjanar: తప్పు లేకుంటే ఎందుకు పారిపోతున్నారు? NTV రిపోర్టర్ల అరెస్టుపై సజ్జనార్ సంచలన వ్యాఖ్యలు

Next Story