పుంజుకున్న రూపాయి విలువ.. డాలర్‌తో పోలిస్తే 33 పైసలు లాభం!

by Malleboina Mahesh |   (  Updated:2026-04-06 05:26:06  IST  )

రూపాయికి ఊరట! డాలర్‌తో పోలిస్తే 33 పైసలు పెరిగిన రూపాయి విలువ. నేడు రూ. 92.85 వద్ద ట్రేడింగ్ ప్రారంభం.

పుంజుకున్న రూపాయి విలువ.. డాలర్‌తో పోలిస్తే 33 పైసలు లాభం!
X

దిశ, వెబ్ డెస్క్: అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు (West Asia War), అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు (Crude Oil) ధరలు పెరగడం వంటి కారణాలు రూపాయి విలువపై ప్రభావం చూపుతున్నాయి. దీంతో గత కొద్దిరోజులుగా క్షీణిస్తూ వచ్చిన భారత రూపాయి విలువ నేడు ట్రేడింగ్ ప్రారంభంలో అనూహ్యంగా పుంజుకుంది. అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 33 పైసలు పెరిగి 92.85 వద్ద ట్రేడ్ అవుతోంది. క్రితం సెషన్‌లో రూపాయి విలువ రూ. 93.18 వద్ద ముగియగా, నేడు సానుకూల వాతావరణం మధ్య రూ. 92.85 వద్ద ప్రారంభమైంది.

దేశీయ స్టాక్ మార్కెట్లలోకి విదేశీ పెట్టుబడులు స్వల్పంగా రావడం, అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ ఇండెక్స్ (Dollar Index) కొంత బలహీనపడటం రూపాయికి కలిసి వచ్చింది. అలాగే ఆసియా కరెన్సీల బలోపేతం, ముడి చమురు ధరల్లో స్వల్ప స్థిరత్వం కూడా రూపాయి పుంజుకోవడానికి దోహదపడ్డాయి. గత వారం రూపాయి విలువ రికార్డు స్థాయి పతనాన్ని (రూ. 93 దాటి) చూసిన తర్వాత, నేటి రికవరీ ఇన్వెస్టర్లకు కొంత ఉపశమనాన్ని కలిగించింది. అయితే, అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రూపాయి విలువలో ఒడుదొడుకులు కొనసాగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.

స్టాక్ మార్కెట్ అప్‌డేట్: నష్టాల్లో ప్రారంభమైన సెన్సెక్స్, నిఫ్టీ!

Next Story