`డ‌బుల్ ` సేల్‌..? స్థానిక అధికార పార్టీ నేత‌లే బ్రోక‌ర్లు..!

by Dishafeatures2 |
`డ‌బుల్ ` సేల్‌..? స్థానిక అధికార పార్టీ నేత‌లే బ్రోక‌ర్లు..!
X

ఇండ్లు లేని నిరుపేద‌ల కోసం రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్య‌కంగా నిర్మించిన డ‌బుల్ బెడ్ రూం ఇండ్లు అన‌ర్హుల పాల‌వుతున్నాయి. అర్హులైన ల‌బ్ధిదారుల‌కు అందాల్సిన `డ‌బుల్` ఇండ్ల‌ను అధికార పార్టీకి చెందిన స్థానిక నేత‌లే విక్ర‌యిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఒక్కో డ‌బుల్ బెడ్ రూమ్ ఫ్లాట్‌ను ఎమ్మెల్యే అనుచ‌రులు, స్థానిక అధికార పార్టీ నేత‌లు రూ. 15 ల‌క్షల‌కు అమ్ముకుంటున్న‌ట్లు స‌మాచారం. దీంతో ఎంతో కాలంగా డ‌బుల్ బెడ్ రూం ఇండ్ల కోసం ఎదురుచూస్తున్నపేద‌లు ఆందోళ‌న చెందుతున్నారు.

దిశ‌, ఎల్బీన‌గ‌ర్: ఎల్బీన‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గం హ‌య‌త్‌న‌గ‌ర్ మండ‌ల ప‌రిధిలోని వ‌న‌స్థ‌లిపురం రైతుబ‌జార్ వ‌ద్ద ప్రభుత్వం డ‌బుల్ బెడ్‌రూమ్ ఇండ్ల నిర్మాణం చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. ఎన్నో ఏళ్లుగా అక్క‌డే గుడిసెలు వేసుకుని జీవిస్తున్న పేద‌ల‌కు డ‌బుల్ బెడ్ రూమ్‌ ఇండ్లు మంజూరు చెస్తామ‌ని చెప్పి ఖాళీ చేయించి అదే స్థ‌లంలో ఇండ్ల నిర్మాణ ప‌నుల‌ను ప్రభుత్వం చేప‌ట్టింది. నిర్మాణ ప‌నులు పూర్తి కావ‌డంతో అక్క‌డే 2020 డిసెంబ‌ర్ 16 వ తేదీన అదే స్థ‌లంలో నివాస‌మున్న 188 మంది ల‌బ్ధిదారుల‌ను గుర్తించి మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా డ‌బుల్ బెడ్ రూం ఇంటి తాళాల‌ను అంద‌జేశారు.

దీంతో అదే రోజు చాలా మంది తాము కూడా ఇదే స్థ‌లంలో నివాస‌మున్నామ‌ని, త‌మ‌కు అన్యాయం జ‌రిగిందంటూ ఆందోళ‌న‌కు దిగారు. దీంతో మ‌రోసారి వారికి అవ‌కాశం క‌ల్పిస్తామ‌ని న‌చ్చ‌జెప్పారు. ఇక అప్ప‌టి నుండి ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌భుత్వం గానీ, అధికారులు గానీ ల‌బ్ధిదారులెవ‌ర‌నీ గుర్తించ‌లేదు. అయితే ఇటీవ‌ల కొంత కాలంగా ఎమ్మెల్యే అనుచ‌రులు, స్థానిక అధికార పార్టీ నేత‌లు ఒక్కో ఫ్లాట్‌ను రూ. 15 ల‌క్ష‌ల‌కు విక్ర‌యించిన‌ట్లు ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. దీంతో త‌మ‌కు ద‌క్కాల్సిన డ‌బుల్ బెడ్‌రూమ్ ఇండ్లు త‌మ‌కు అనుకూల‌మైన వారికి అమ్ముకుంటున్నారంటూ పేద‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

ఒక్కో ఫ్లాటు రూ.15 లక్ష‌లు..!

వ‌న‌స్థ‌లిపురం రైతు బ‌జార్ వ‌ద్ద ప్ర‌భుత్వం రూ. 28.03 కోట్ల‌తో 3 బ్లాకుల్లో 324 డ‌బుల్ బెడ్ రూం ఇండ్ల‌ను నిర్మించింది. నిర్మాణం పూర్తి కావ‌డంతో ఐదేళ్ల క్రిత‌మే గుర్తించిన‌ 188 మంది ల‌బ్ధిదారుల‌కు మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా అధికారులు అంద‌జేశారు. ఇంత వ‌ర‌కూ బాగానే ఉంది. కానీ ఈ మ‌ధ్య కాలంలో స్థానిక అధికార పార్టీ నేతులు, ఎమ్మెల్యే అనుచ‌రులు మ‌రో 15 కుటుంబాల‌కు అన‌ధికారికంగా ఒక్కో ఫ్లాట్‌ను రూ. 15 ల‌క్ష‌ల‌కు విక్ర‌యించిన‌ట్లుగా స‌మాచారం. అధికారికంగా మంజూరు అయిన కుటుంబాలు కాకుండా మ‌రో 15 కుటుంబాలు అన‌ధికారికంగా ఫ్లాట్ల‌ను పొందిన‌ట్లుగా తెలుస్తోంది. వ‌న‌స్థ‌లిపురం రైతుబ‌జార్ వ‌ద్ద డ‌బుల్ బెడ్‌రూమ్ ఇండ్ల క్ర‌య విక్ర‌యాలు గుట్టుచ‌ప్పుడు కాకుండా జ‌రుగుతున్న‌ట్లు ప‌లువురు ఆరోపిస్తున్నారు. బాధ్యుల‌పై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

ఉన్న‌తాధికారు చ‌ర్య‌లు తీసుకోవాలి

స్థానికంగా ఉన్న నిరుపేద‌లు తాము కూడా గుడిసెలు వేసుకుని సంత్స‌రాల త‌ర‌బ‌డి దుర్భ‌ర‌జీవ‌నం గుడుపుతున్నా ఇండ్లు ఇవ్వ‌లేద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. నిజ‌మైన ల‌బ్ధిదారుల‌కే డ‌బుల్ బెడ్‌రూం ఇండ్లు ద‌క్కాల‌ని స్థానిక పేద‌లు కోరుతున్నారు. ప్ర‌భుత్వ గానీ, అధికారులు గానీ ల‌బ్ధిదారులను ఎంపిక చేయ‌కుండానే కొంత మంది ఇండ్ల‌ను విక్ర‌యిస్తున్నార‌ని వాపోతున్నారు. దీంతో ఎటువంటి ఆధారాలు లేకుండానే 15 కుటుంబాలు తిష్ట‌వేశాయ‌ని చెబుతున్నారు. దీనిపై జిల్లా ఉన్న‌తాధికారులు స్పందించి వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతున్నారు.


Next Story