ఆలేరు మున్సిపాలిటీలో అటకెక్కిన ఆర్టీఐ చట్టం..!

by Batti.Sumithra |

ప్రజలకు సమాచారం అందించి ప్రభుత్వ వ్యవస్థలో పారదర్శకతను తీసుకురావాలనే ఉద్దేశంతో అమల్లోకి వచ్చిన సమాచార హక్కు చట్టం (RTI) ఆలేరు మున్సిపాలిటీలో కాగితాలకే పరిమితమైందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఆలేరు మున్సిపాలిటీలో అటకెక్కిన ఆర్టీఐ చట్టం..!
X

దిశ, ఆలేరు : ప్రజలకు సమాచారం అందించి ప్రభుత్వ వ్యవస్థలో పారదర్శకతను తీసుకురావాలనే ఉద్దేశంతో అమల్లోకి వచ్చిన సమాచార హక్కు చట్టం (RTI) ఆలేరు మున్సిపాలిటీలో కాగితాలకే పరిమితమైందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చట్టం ప్రకారం నిర్ణీత గడువులో సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత కలిగిన ప్రజా సమాచార అధికారి (PIO), మున్సిపల్ మేనేజర్ జగన్మోహన్, అప్పిలేట్ అధికారి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డిలు ఆర్టీఐ దరఖాస్తులను నిర్లక్ష్యంగా పక్కనపెట్టి, సమాచారం కోరిన వారిని కార్యాలయం చుట్టూ నెలల, సంవత్సరాల తరబడి తిప్పిస్తున్నారనే ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి.

సమాచారం ఇస్తే అవకతవకలు బయటపడతాయనే భయమా..?

ప్రజలకు జవాబుదారీతనంతో వ్యవహరించాల్సిన మున్సిపల్ కమిషనర్, మేనేజర్, అధికారులు, చట్టాన్ని తుంగలో తొక్కుతూ సమాచారం ఇవ్వకుండా కాలయాపన చేయడం వెనుక అసలు కారణమేంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మున్సిపాలిటీలో జరిగిన ఆర్థిక లావాదేవీలు, నిర్మాణ అనుమతులు, పన్నుల వివరాలు, ఇతర పరిపాలనా వ్యవహారాల్లోని అవకతవకలు బయటపడతాయనే ఉద్దేశంతోనే సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా నిలిపివేస్తున్నారని దరఖాస్తుదారులు ఆరోపిస్తున్నారు.

73 రోజులు గడిచినా సమాచారం లేదు..!

ఆలేరు మున్సిపాలిటీకి సంబంధించిన ఆదాయ–వ్యయ వివరాలు, ఇతర అధికారిక రికార్డుల నకళ్లు కోరుతూ దిశ ప్రతినిధి 2026 మే 8న సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశారు. అయితే దరఖాస్తు చేసి నేటికి 73 రోజులు గడిచినా ఇప్పటికీ సమాచారం అందించలేదు. ఈ విషయాన్ని మున్సిపల్ కమిషనర్ కే. శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేకపోవడం గమనార్హం. సమాచార హక్కు చట్టం ప్రకారం 30 రోజుల్లో సమాచారం ఇవ్వడం తప్పనిసరి అయినప్పటికీ, ఆ నిబంధనలను ఆలేరు మున్సిపాలిటీ అధికారులు బేఖాతర్ చేస్తూ దరఖాస్తుదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సంవత్సరం గడిచినా స్పందనే లేదు..!

ఆలేరు పట్టణానికి చెందిన దయ్యాల సంపత్ జేఎంజె ఉన్నత పాఠశాల భవన నిర్మాణాలకు సంబంధించిన అనుమతులు, పన్నుల వివరాల నకళ్లు కోరుతూ గత ఏడాది ఆర్టీఐ దరఖాస్తు చేశారు. అయితే సంవత్సరం గడిచినా ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు.

అప్పీల్ చేసినా ఫలితం శూన్యం..!

ఆలేరు పట్టణానికి చెందిన ఎగ్గిడి సంపత్, స్థానిక పోచమ్మగుడి సమీపంలో దారిని ఆక్రమించి అనుమతులు లేకుండా నిర్మిస్తున్న ఇంటిపై మున్సిపాలిటీకి ఫిర్యాదు చేశారు. అధికారులు స్పందించకపోవడంతో, తన ఫిర్యాదుపై తీసుకున్న చర్యల వివరాలు కోరుతూ 2026 ఏప్రిల్ 4న ఆర్టీఐ దరఖాస్తు చేశారు. 30 రోజులు దాటినా సమాచారం అందకపోవడంతో, 2026 ఏప్రిల్ 23న మున్సిపల్ కమిషనర్‌కు తొలి అప్పీల్ కూడా చేశారు. అయినప్పటికీ నేటికీ సమాచారం ఇవ్వకుండా కార్యాలయం చుట్టూ తిప్పిస్తున్నారని ఎగ్గిడి సంపత్ ఆరోపిస్తున్నాడు.

ఆర్టీఐ చట్టాన్ని అమలు చేస్తున్నారా... లేక నిర్వీర్యం చేస్తున్నారా..?

ప్రజలకు సమాచారం అందించాల్సిన కార్యాలయమే సమాచారాన్ని దాచిపెడితే పారదర్శక పాలన ఎలా సాధ్యమని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వం పారదర్శక పరిపాలనకు ప్రాధాన్యత ఇస్తుంటే, మరోవైపు ఆలేరు మున్సిపాలిటీలో ఆర్టీఐ చట్టం అమలు కాకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆలేరు మున్సిపాలిటీలో పెండింగ్‌లో ఉన్న ఆర్టీఐ దరఖాస్తులపై జిల్లా ఉన్నతాధికారులు వెంటనే విచారణ జరిపి, చట్టాన్ని ఉల్లంఘించిన బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని దరఖాస్తుదారులు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Next Story