- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రూ.30 లక్షలు ముళ్ళ చెట్లకేనా?
మహిళా లోకానికి ఆసరాగా నిలిచి వారి జీవితాల్లో వెలుగులు నింపాల్సిన వెలుగు కార్యాలయం పాలకుల ఘోర నిర్లక్ష్యానికి బలై చీకట్లోకి మగ్గుతోంది.

దిశ, డోర్నకల్: మహిళా లోకానికి ఆసరాగా నిలిచి వారి జీవితాల్లో వెలుగులు నింపాల్సిన వెలుగు కార్యాలయం పాలకుల ఘోర నిర్లక్ష్యానికి బలై చీకట్లోకి మగ్గుతోంది. చుట్టూ ముళ్లపొదలు కంపచెట్లు కమ్ముకొని ఆ భవనం కనుమరుగవుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండల కేంద్రంలో పదకొండు ఏండ్లుగా సాగుతున్న మండల సమైక్య భవన నిర్మాణం మూడడుగులు ముందుకు.. ఆరడుగులు వెనక్కి అన్న చందంగా తయారైంది.ఏళ్లు గడుస్తున్నా పాలకులు మారుతున్నా.. అధికారులు మారుతున్నా.. ఈ భవన అసంపూర్ణ తలరాత మాత్రం మారకపోవడం గమనార్హం.
రెండున్నర దశాబ్దాలుగా అద్దె నరకం.. ఆగిన సొంత కల..
మండల మహిళా సమైక్య సంఘాలు దాదాపు 26 ఏండ్లుగా అద్దె భవనాల్లోనే మగ్గుతున్నాయి.మహిళలు స్వశక్తితో ఎదగడానికి,సమావేశాలు నిర్వహించుకోవడానికి కనీస స్థలం లేక ఇరుకు గదుల్లో నరకం చూస్తున్నారు.ఈ అద్దె నరకం నుంచి విముక్తి కల్పించేందుకు మహిళల కంటూ ఒక సొంత భవనాన్ని నిర్మించాలనే కల పదకొండు ఏండ్లు క్రితం మొదలైంది.కానీ ఆ కల చివరి దశలో చిక్కుకుంది.నేటికీ మహిళలకు సొంత గూడు కరువై ప్రజాధనం అద్దెల రూపంలో వృథా అవుతోంది.లక్షల విలువైన ఆశయాలతో ప్రారంభమైన ఐకెపి భవనం నేడు భూత్ బంగ్లాను తలపిస్తోంది.భవనం చుట్టూ దట్టమైన ముళ్లపొదలు,కంపచెట్లు పేరుకుపోయాయి.లోపలికి వెళ్లాలంటేనే భయపడేలా పాములు,తేళ్లకు నిలయంగా మారింది.బయట చూస్తే పిచ్చిమొక్కల సామ్రాజ్యం లోపల చూస్తే అంతా శూన్యంగా దర్శనమిస్తుంది.మహిళలోకానికి అందుబాటులోకి రాకపోవడంతో శిథిలావస్థకు చేరుకుంటుంది.ఇంత జరుగుతున్నా స్థానిక అధికారులు కనీసం అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం వారి నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనమనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.
పాలకులు మారారు.. కుర్చీలో అధికారులు మారారు ..
రాష్ట్రంలో పాలకులు మారారు.. ప్రభుత్వాలు మారాయి.. కుర్చీల్లో కూర్చునే అధికారులూ మారారు.కానీ మహిళా సంఘాల బలోపేతం కోసం నిర్మిస్తున్న వెలుగు భవనం భాగ్యోదయం మాత్రం కలగలేదు.దశాబ్ద కాలం దాటినా భవనాన్ని పూర్తి చేయకపోవడం తమను అవమానించడమేనని మహిళా ప్రతినిధులు పేర్కొంటున్నారు.సమావేశాలు, సమైక్య బలోపేత కార్యక్రమాలకు మండల నలుమూలల నుంచి వచ్చే మహిళలు అద్దె భవనంలో ఇరుకు గదుల్లో కనీస సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అధికారులను సమన్వయం చేసి వెలుగు భవన నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నాం.
మండల సమైక్య అధ్యక్షురాలు బెల్దే నాగమణి
కాంగ్రెస్ సర్కార్ కరుణించేనా.. మహిళా సాధికారత సాకారమయ్యేనా..?
2015లో అప్పటి ఎమ్మెల్యే రెడ్యానాయక్ సుమారు 25 లక్షల వ్యయంతో వెలుగు భవన నిర్మాణానికి శంకుస్థాపన జరిపారు.వివిధ కారణాలతో ఆగుతూ.. సాగుతున్న భవన నిర్మాణానికి 2022లో అదనంగా మరో ఐదు లక్షలు మంజూరు జరిపారు.అయినప్పటికీ నిర్మాణం పూర్తికాక పదకొండు ఏండ్లుగా చీకట్లోనే మగ్గుతుంది.గత పాలకుల నిర్లక్ష్యాన్ని పక్కనపెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఈ భవనానికి శాపవిమోచనం కలిగిస్తుందని మహిళలు గాంపెడాశలు పెట్టుకున్నారు.మహిళా సాధికారత కేవలం ప్రసంగాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో సాకారం కావాలంటే ఈ కార్యాలయం పూర్తి కావడం అత్యంత కీలకం.స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ డా,రామచంద్రనాయక్,ఉన్నతాధికారులు స్పందించి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేసి అద్దె నరకం నుండి విముక్తి ప్రసాదించాలని మండల మహిళా లోకం ముక్తకంఠంతో విజ్ఞప్తి చేస్తుంది.






