ఎల్‌నినో ప్రభావం.. రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలివే!

by Jakkula.Mamatha |

పెనుబల్లి మండల పరిధిలోని రామచంద్రరావ్ బంజర గ్రామంలో శనివారం రైతులకు ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పంటల వైవిధ్యీకరణ, వ్యవసాయ కుంటల ప్రాముఖ్యతపై సత్తుపల్లి సహాయ వ్యవసాయ సంచాలకు వి.శ్రీనివాస రెడ్డి అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఎల్‌నినో ప్రభావం.. రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలివే!
X

దిశ,పెనుబల్లి: పెనుబల్లి మండల పరిధిలోని రామచంద్రరావ్ బంజర గ్రామంలో శనివారం రైతులకు ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పంటల వైవిధ్యీకరణ, వ్యవసాయ కుంటల ప్రాముఖ్యతపై సత్తుపల్లి సహాయ వ్యవసాయ సంచాలకు వి.శ్రీనివాస రెడ్డి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎల్‌నినో అంటే ఏమిటి, ఎల్‌నినో రావడానికి గల కారణాలు దీని ప్రభావం వల్ల పంటలకు కలిగే నష్టాలు తెలియజేశారు. ఎల్‌నినో కారణంగా వర్షపాతం అస్థిరంగా ఉండే అవకాశం ఉన్నందున రైతులు నీటి అవసరం తక్కువగా ఉండే పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. వరి సాగుకు బదులుగా పత్తి, పెసర, మినుము, కంది, నువ్వులు , కుసుమ వంటి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయడం ద్వారా వాతావరణ మార్పుల వల్ల కలిగే నష్టాలను తగ్గించుకోవచ్చని తెలిపారు.

బోర్ వెల్స్ ఉన్న రైతు సోదరులు కూడా వారికి ఉన్న మొత్తం విస్తీర్ణము లో కేవలం 50 శాతం మాత్రమే సాగు చేసుకోవాలి అని తెలియజేశారు. ఐఎండీ నివేదిక ప్రకారం ఈ సంవత్సరం వర్షాలు పడే అవకాశం చాలా తక్కువ అని, సాగర్ జలాలు కూడా వచ్చే అవకాశం లేదని, ప్రస్తుతం వస్తున్న గోదావరి నీళ్లు కూడా కేవలం త్రాగడానికి మాత్రమే అని తెలియజేశారు. ఆరు తడి పంటలు అయినటువంటి జొన్న , కుసుమ, నువ్వులు సాగు చేయదలచిన రైతు సోదరులకు విత్తనాలు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైతులు స్వల్పకాల వ్యవధి గల వరి రకాలను ఎంపిక చేసుకోవడంతో పాటు సాధ్యమైన చోట డైరెక్ట్ సీడ్ రైస్ పద్ధతిని అనుసరించడం ద్వారా నీటి వినియోగం, సాగు ఖర్చులు తగ్గుతాయని వివరించారు.

భూసార పరీక్షల ఆధారంగా ఎరువులను సమతుల్యంగా వినియోగించాలని, నేల సారాన్ని పెంపొందించేందుకు పచ్చిరొట్ట ఎరువుల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. వ్యవసాయ కుంటల నిర్మాణం ద్వారా వర్షపు నీటిని నిల్వ చేసి అవసరమైన సమయంలో పంటలకు జీవనాధార నీటిని అందించవచ్చని తెలిపారు. అలాగే సూక్ష్మ సేద్యం పద్ధతులు, నీటి పొదుపు చర్యలు పాటించడం ద్వారా నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చన్నారు. రైతులు శాస్త్రీయ సాగు పద్ధతులను అనుసరిస్తూ పంటల వైవిధ్యీకరణ, నీటి సంరక్షణ చర్యలు చేపట్టి వాతావరణ మార్పుల ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాలని అధికారులు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సహాయ వ్యవసాయ అధికారి సత్తుపల్లి వి.శ్రీనివాస రెడ్డి, పెనుబల్లి మండల వ్యవసాయ అధికారి ఎంవిఎస్ ప్రసాద రాజు, ఉద్యానవన శాఖ అధికారి నగేష్, నీటి పారుదల శాఖ ఎఈఈ నరేష్, గ్రామీణ నీటి సరఫరా ఏఈ, విద్యుత్ శాఖ లైన్ ఇన్స్పెక్టర్, పెనుబల్లి క్లస్టర్ ఏఈఓ నరేష్, పంచాయతీ కార్యదర్శి వి. నరేంద్ర రెడ్డి, గ్రామ సర్పంచ్ గుగులోత్ హైమవతి, గ్రామస్తులు యలమర్తి శ్రీనివాసరావు, ఆలుగోజు రామ నరసింహారావు, ఇమ్మడి వెంకటేశ్వర్లు, చిన్నం మల్లయ్య మరియు గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.

Next Story