రూ.62 కోట్ల సీఎంఆర్ బియ్యం మాయం

by Muthe.Rajitha |

రూ. 62 కోట్ల విలువైన సీఎంఆర్ బియ్యం నిల్వలను రైస్ మిల్లుల యజమానులు అక్రమంగా విక్రయించుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

రూ.62 కోట్ల సీఎంఆర్ బియ్యం మాయం
X

దిశ, నారాయణపేట ప్రతినిధి: జిల్లాలో సీఎంఆర్ నిల్వలకు రెక్కలొచ్చాయి. అటు అధికారుల నిర్లక్ష్యం, ఇటు రైస్ మిల్లర్ల మాయాజాలంతో ప్రభుత్వ ఖజానాకు భారీ గండి పడింది. 2020 నుంచి 2022 సంవత్సరాల కాలానికి గాను రబీ, ఖరీఫ్ సీజన్లకు సంబంధించి సుమారు రూ. 62 కోట్ల విలువైన బియ్యం నిల్వలను 15 మిల్లుల యజమానులు అక్రమంగా విక్రయించుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇంత పెద్ద మొత్తంలో అవకతవకలు జరిగినప్పటికీ, ఇప్పటి వరకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంలో యంత్రాంగం విఫలమైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

అధికారుల పర్యవేక్షణ లోపమే కారణమా?..

జిల్లా పౌరసరఫరాల శాఖ గుర్తించిన 71 రైస్ మిల్లులకు ప్రభుత్వం ధాన్యాన్ని అప్పగించింది. వీటిలో నిరంతరం తనిఖీలు నిర్వహించి, సీఎంఆర్ నిల్వలను సరిచూసుకోవాల్సిన బాధ్యత అధికారులదే. అయితే, క్షేత్రస్థాయిలో తనిఖీలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయి. ఓ కీలక అధికారి అండదండలతోనే ఈ దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోందని తెలుస్తోంది. మిల్లర్ల నుండి భారీగా మామూళ్లు అందుతుండటంతోనే తనిఖీల విషయంలో అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం.

పక్కదారి పట్టిన నిల్వలు..

మిల్లర్లు తమకు కేటాయించిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి ప్రభుత్వానికి బియ్యం అప్పగించాల్సి ఉండగా సుమారు 62 కోట్ల విలువైన బియ్యాన్ని నేరుగా కర్ణాటక, మహారాష్ట్ర వంటి పొరుగు రాష్ట్రాలకు తరలించి విక్రయించినట్లు తెలుస్తోంది. గత జనవరిలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు జరిపిన దాడుల్లో ఏడు రైస్ మిల్లులపై కేసులు నమోదైనా, వాటి వివరాలను కూడా గోప్యంగా ఉంచడం గమనార్హం. దామరగిద్ద మండలంలోనే సుమారు రూ. 13 కోట్ల విలువైన ధాన్యం పక్కదారి పట్టినట్లు విచారణలో తేలింది.

రేషన్ బియ్యంతో రీసైక్లింగ్ మాయాజాలం..

మరోవైపు, గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు పంపిణీ చేసే రేషన్ బియ్యాన్ని దళారుల ద్వారా కిలో రూ. 18 చొప్పున సేకరిస్తున్నారు. ఈ బియ్యాన్ని రైస్ మిల్లులకు చేరవేసి, తిరిగి ప్రభుత్వం ఇచ్చిన ధాన్యంగా చూపిస్తూ 'రీసైక్లింగ్' దందా కొనసాగిస్తున్నారు. దీని కోసం కొంతమంది రేషన్ డీలర్లకు మిల్లర్లు ముందుగానే అడ్వాన్సులు ఇస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

కదిలిన యంత్రాంగం..

ఇటీవల ముఖ్యమంత్రి పౌరసరఫరాల శాఖపై జరిపిన సమీక్షలో అక్రమాలకు పాల్పడిన మిల్లర్ల ఆస్తులను జప్తు చేయాలని ఆదేశించడంతో జిల్లా అధికారుల్లో కదలిక వచ్చింది. 15 మిల్లుల నుంచి బకాయిల వసూలుకు ఒత్తిడి పెంచుతున్నారు. ఇప్పటివరకు కేవలం రూ. 1.86 కోట్లు మాత్రమే రికవరీ కాగా, మిగిలిన రూ. 60 కోట్లకు పైగా బాకీలను రాబట్టేందుకు రెవెన్యూ రికవరీ చట్టం కింద చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుత రబీ సీజన్ లో సుమారు 1.97 లక్షల టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉందని అంచనా. ఈ సీజన్ లోనైనా అక్రమాలకు పాల్పడిన మిల్లర్లకు ధాన్యం కేటాయించకుండా ఉంటారా? లేక మళ్లీ పాత పద్ధతినే అనుసరిస్తారా? అనేది వేచి చూడాలి.

లీగల్ సెల్ ద్వారా పరిష్కరించుకోండి -సీహెచ్ సైదులు, పౌరసరఫరాల శాఖ జిల్లా అధికారి

రాష్ట్రవ్యాప్తంగా సీఎంఆర్ నిలువలను అక్రమ వ్యాపారం చేసిన రైస్ మిల్లర్ల యజమానుల కోసం ప్రభుత్వం లీగల్ సెల్ ఏర్పాటు చేసింది. ఇప్పటికే 15 రైస్ మిల్లర్ల యజమానులపై కేసులు నమోదు చేసి ఆస్తులను జప్తు చేశాం. లీగల్ సెల్ గైడెన్స్ ద్వారా 15 రైస్ మిల్లర్ల యజమానుల నుంచి 62 కోట్ల రూపాయలను రికవరీ చేసుకుంటాం.

Next Story