నకిలీ స్థిరాస్తి పత్రాలతో రూ.4.11 కోట్ల బ్యాంకు రుణాల మోసం

by Ratna Kumari |

నకిలీ స్థిరాస్తి పత్రాలు సృష్టించి వివిధ బ్యాంకులను మోసం చేస్తూ రూ.4.11 కోట్ల రుణాలు పొందిన ముఠాను కీసర పోలీసులు అరెస్టు చేశారు.

నకిలీ స్థిరాస్తి పత్రాలతో రూ.4.11 కోట్ల బ్యాంకు రుణాల మోసం
X

దిశ, కీసర : నకిలీ స్థిరాస్తి పత్రాలు సృష్టించి వివిధ బ్యాంకులను మోసం చేస్తూ రూ.4.11 కోట్ల రుణాలు పొందిన ముఠాను కీసర పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో తొమ్మిది మందిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు మల్కాజిగిరి డీసీపీ శ్రీధర్ తెలిపారు. శుక్రవారం కీసర పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీసీపీ కేసు వివరాలను వెల్లడించారు. కీసర పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసు దర్యాప్తులో అసలు భూముల యజమానుల పేర్లతో నకిలీ సేల్ డీడ్లు, జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ (GPA), అగ్రిమెంట్ ఆఫ్ సేల్ పత్రాలు, మెమొరాండం ఆఫ్ డిపాజిట్ ఆఫ్ టైటిల్ డీడ్స్ (MOD) తదితర నకిలీ పత్రాలు తయారు చేసి వివిధ బ్యాంకులను మోసం చేసినట్లు గుర్తించినట్లు తెలిపారు.

ఈ కేసులో ప్రధాన నిందితులతో పాటు మొత్తం తొమ్మిది మందిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. నిందితుల వద్ద నుంచి నకిలీ స్థిరాస్తి పత్రాలు, డిజిటల్ ఆధారాలు, మొబైల్ ఫోన్లు, ఇతర కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. పలు చట్టపరమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా భూముల కొనుగోలు, విక్రయాలు లేదా బ్యాంకు రుణాల సమయంలో పత్రాల ప్రామాణికతను సంబంధిత అధికారులతో తప్పనిసరిగా ధృవీకరించుకోవాలని డీసీపీ ప్రజలకు సూచించారు. అనుమానాస్పద లావాదేవీలు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో ఏసీపీ చక్రపాణి, సీఐ ఆంజనేయులు, డీఐ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Next Story