ఎంఆర్డీసీఎల్ కు రూ.375 కోట్లు

by Muthe.Rajitha |

మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది.

ఎంఆర్డీసీఎల్ కు రూ.375 కోట్లు
X

దిశ, తెలంగాణ బ్యూరో : మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్ర బడ్జెట్ లో కేటాయించిన రూ.1500కోట్లలో మొదటి త్రైమాసికానికి సంబంధించిన రూ.375కోట్లకు పరిపాలన మంజూరు ఇస్తూ హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా, అర్బన్ డవలప్ మెంట్ డిపార్ట్ మెంట్ స్పెషల్ సీఎస్ జయేష్ రంజన్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. మరో రూ.1,125 కోట్లకు పరిపాలన మంజూరు ఇవ్వాల్సి ఉందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 2024-25 బడ్జెట్ లో రూ.1500కోట్లు కేటాయించి రూ.11.25కోట్లు ఖర్చు చేశారు. 2025-26 బడ్జెట్ లో కూడా రూ.1500కోట్లు కేటాయించినా రూ.6.21కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. అయితే ఈ సారి ప్రభుత్వ నిధులు కేటాయించడంతోపాటు మొదటి దశ ప్రాజెక్టు కోసం ఏడీబీ నుంచి రూ.4,100కోట్ల రుణం తీసుకోవాలని నిర్ణయించడం, అందుకు ఏడీబీ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మొదటి త్రైమాసికానికి సంబంధించిన రూ.375కోట్లకు పరిపాలన మంజూరు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకున్నది.

భూసేకరణ వేగవంతం…

మూసీ పునరుజ్జీవనం మొదటి దశ ప్రాజెక్టులో భాగంగా 21కిలోమీటర్లకు సంబంధించి డీపీఆర్ రెడీ చేయడంతోపాటు ఏడీబీ రుణం కోసం అందజేసిన సంగతి విధితమే. దీంతోపాటు ఈ ప్రాజెక్టు కోసం భూసేకరణ కార్యక్రమాన్ని సైతం వేగవంతం చేశారు. ఇప్పటికే 50ఎకరాల కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ కూడా జారీచేసింది. నోటిఫికేషన్ లో భాగంగా పలువురికి నోటీసులు కూడా జారీచేశారు. ఈసా నది సమీపంలోని గండిపేట మండలం హిమాయత్‌ సాగర్‌, కిస్మత్‌పూర్‌, రాజేంద్రనగర్‌ మండలానికి చెందిన ప్రేమావతిపేట్‌, బుద్వేల్‌ ప్రాంతాల్లో ఉన్న టీఈఈఆర్‌ఎల్‌, ఐఐపీహెచ్‌, ఇతర సంస్థలకు కేటాయించిన భూములతోపాటు శంషాబాద్‌ మండలం కొత్వాల్‌గూడ పరిధిలో హెచ్‌ఎండీఏ లేఅవుట్‌ కోసం కేటాయించిన 734 ఎకరాల భూములను మూసీకి బదలాయించారు. ఈ సంస్థలకు ఫ్యూచర్ సిటీలో భూములను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.

Next Story