విమర్శలు వద్దు.. అభివృద్ధికి సహకరించాలి

by Batti.Sumithra |

ప్రధానమంత్రి నరేంద్రమోదీ 12 ఏళ్ల పాలనలో తెలంగాణ అభివృద్ధికి దాదాపు రూ.14 లక్షల కోట్లు కేటాయించారని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జీ.కిషన్‌రెడ్డి తెలిపారు.

విమర్శలు వద్దు.. అభివృద్ధికి సహకరించాలి
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి / కొమురవెల్లి : ప్రధానమంత్రి నరేంద్రమోదీ 12 ఏళ్ల పాలనలో తెలంగాణ అభివృద్ధికి దాదాపు రూ.14 లక్షల కోట్లు కేటాయించారని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జీ.కిషన్‌రెడ్డి తెలిపారు. ఇకనైనా విమర్శలు మాని అభివృద్ధికి సహకరించాలని, రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు మ్యాచింగ్‌ గ్రాంట్లు ఇచ్చి కేంద్ర నిధులను సద్వినియోగం చేసుకోవాలని హితవు పలికారు. సిద్దిపేట జిల్లా పరిధిలోని కొమురవెల్లి పుణ్యక్షేత్రం రైల్వే స్టేషన్‌ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఎంపీలు మాధవనేని రఘునందన్‌రావు, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు కె. లక్ష్మణ్, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డిలతో కలిసి జీ. కిషన్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైల్వే ట్రాక్‌లు కేవలం రెండు పట్టాలు కాదని, అవి అభివృద్ధి బాటలు, ఉపాధి అవకాశాల పట్టాలని అన్నారు.

భక్తి, పర్యాటకం, ప్రగతిని కలిపే పట్టాలుగా రైల్వేలు నిలుస్తాయని పేర్కొన్నారు. కొమురవెల్లి రైల్వే స్టేషన్ భవిష్యత్తులో అభివృద్ధికి చిరునామాగా నిలవాలని, మల్లన్న స్వామి ఆశీస్సులు తెలంగాణ ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ప్రధాని మోదీ రోడ్డు, రైల్వే, విమాన కనెక్టివిటీలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. అందులో భాగంగా గత 12 ఏళ్లలో ట్రిపుల్‌ఆర్‌ (రీజినల్‌ రింగ్‌ రోడ్‌)తో పాటు తెలంగాణలో జాతీయ రహదారుల నిర్మాణానికి రూ.1,74,412 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో పౌర విమానయాన రంగ అభివృద్ధికి దాదాపు రూ.1,073 కోట్లు కేటాయించినట్లు చెప్పారు.

కేంద్రంలో మోదీ సారథ్యంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భారతీయ రైల్వేల్లో నూతన శకం ప్రారంభమైందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రైల్వేలను అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు. దేశవ్యాప్తంగా రైల్వేల అభివృద్ధి కోసం గత 12 ఏళ్లలో దాదాపు రూ.23 లక్షల కోట్ల బడ్జెట్‌ను కేటాయించినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి యూపీఏ హయాంలో రూ.258 కోట్లు మాత్రమే కేటాయించగా, మోదీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైల్వే బడ్జెట్‌ 20 రెట్లు పెరిగిందన్నారు. ఈ ఏడాది తెలంగాణకు రూ.5,454 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. గత 12 ఏళ్లలో తెలంగాణలో రైల్వేల కోసం రూ.36,286 కోట్లు ఖర్చు చేయగా, మరో రూ.47,984 కోట్ల విలువైన రైల్వే అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకం కింద రాబోయే 50 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లను ఆధునికీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణలో రూ.2,000 కోట్లకు పైగా వ్యయంతో 40 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు.

తెలంగాణకు మూడు బుల్లెట్‌ రైళ్లు..

దేశవ్యాప్తంగా ఏడు బుల్లెట్‌ రైళ్లను మంజూరు చేయగా, తెలంగాణకు మూడు బుల్లెట్‌ రైళ్లను కేటాయించినట్లు కేంద్ర మంత్రి జీ. కిషన్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌–బెంగళూరు, హైదరాబాద్‌–చెన్నై, హైదరాబాద్‌–పూణే హైస్పీడ్‌ రైల్‌ కారిడార్ల నిర్మాణం కోసం రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు. వీటితో పాటు ఎంఎంటీఎస్‌ ఫేజ్‌–2, ఔటర్‌ రింగ్‌ రైల్‌ ప్రాజెక్టుతో సహా మరో 30 కొత్త రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి ఫైనల్‌ లొకేషన్‌ సర్వే జరుగుతోందన్నారు. వీటి నిర్మాణం కోసం రూ.84,492 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. రూ.1,122 కోట్లతో హైదరాబాద్‌ ఎంఎంటీఎస్‌ను యాదాద్రి వరకు విస్తరించనున్నట్లు వెల్లడించారు. రూ.715 కోట్లతో సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌, రూ.322 కోట్లతో నాంపల్లి రైల్వే స్టేషన్‌ ఆధునికీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, ఇప్పటికే రూ.430 కోట్లతో నిర్మించిన చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ విమానాశ్రయాన్ని తలపిస్తోందని పేర్కొన్నారు.

రాష్ట్రంలో 340 కి.మీ. కొత్త రైల్వే మార్గాలు..

గత 12 సంవత్సరాల్లో రాష్ట్రంలో 340 కి.మీ. కొత్త రైల్వే మార్గాలు నిర్మించినట్లు కేంద్ర మంత్రి జీ. కిషన్‌రెడ్డి తెలిపారు. 576 కి.మీ. మేర డబ్లింగ్‌, ట్రిప్లింగ్‌, క్వాడ్రుప్లింగ్‌, బైపాస్‌ లైన్లు, 2,034 ట్రాక్‌ కి.మీ. విద్యుదీకరణ పూర్తి చేసినట్లు చెప్పారు. మనోహరాబాద్‌–కొత్తపల్లి (సిద్దిపేట–కొత్తపల్లి) కొత్త రైల్వే మార్గం, కాజీపేట–విజయవాడ ట్రిప్లింగ్‌, ముద్‌ఖేడ్‌–మెద్చల్‌ డబ్లింగ్‌ నిర్మాణ పనులు కొనసాగుతున్నట్లు వెల్లడించారు. గత 12 ఏళ్లలో 627 కి.మీ. మార్గంలో 63 స్టేషన్లకు కవచ్‌ 3.2 వ్యవస్థ అమలు చేసినట్లు తెలిపారు. అన్‌మ్యాన్డ్‌ లెవల్‌ క్రాసింగ్‌లను పూర్తిగా తొలగించామని, 329 రోడ్డు అండర్‌ బ్రిడ్జిలు, 59 రోడ్డు ఓవర్‌ బ్రిడ్జిలు, 58 ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిలను నిర్మించినట్లు వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని రైల్వే స్టేషన్లలో హైస్పీడ్‌ వై-ఫై సౌకర్యం కల్పించడంతో పాటు, ప్రయాణికుల కోసం 73 స్టేషన్లలో ‘వన్‌ స్టేషన్‌–వన్‌ ప్రొడక్ట్‌’ స్టాళ్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కాజీపేటలో నిర్మిస్తున్న రైల్వే మాన్యుఫాక్చరింగ్‌ యూనిట్‌ పనులు తుది దశకు చేరుకున్నాయని తెలిపారు. ఈ యూనిట్‌లో భవిష్యత్తులో నూతన తరం ఇంటర్‌సిటీ రైళ్ల తయారీకి ప్రతిపాదనలు ఉన్నాయని వెల్లడించారు.

నరేంద్రమోదీ పాలనలో రైల్వే రంగంలో నూతన శకం ఆరంభమైంది : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్

ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాలనలో రైల్వే రంగంలో నూతన శకం ఆరంభమైందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ అన్నారు. గత 12 ఏళ్లలో దేశవ్యాప్తంగా రైల్వే రంగ అభివృద్ధికి దాదాపు రూ.23 లక్షల కోట్లు కేటాయించినట్లు చెప్పారు. తెలంగాణలో మునుపెన్నడూ లేని విధంగా రైల్వే లైన్ల నిర్మాణం, నూతన రైళ్లు, స్టేషన్ల ఆధునికీకరణ పేరిట వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే రూ.36 వేల కోట్లకుపైగా నిధులు ఖర్చు చేసిన కేంద్రం, మరో రూ.84,492 కోట్ల అంచనా వ్యయంతో 30 రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి ఫైనల్‌ లొకేషన్‌ సర్వే పనులు కొనసాగిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణకు మూడు బుల్లెట్‌ రైళ్లు రాబోతున్నాయని, అందుకోసం రూ.1.50 లక్షల కోట్లతో హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌ నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు వివరించారు. మోదీ 12 ఏళ్ల పాలనలో తెలంగాణకు రూ.13 లక్షల 9 వేల కోట్లు కేటాయించామని, కేవలం ఓఆర్ఆర్‌తో పాటు జాతీయ రహదారుల నిర్మాణం కోసమే రూ.1.74 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు.

Next Story