చేప ప్రసాద పంపిణీ ప్రశాంతంగా జరిగేందుకు పటిష్ట చర్యలు

by Batti.Sumithra |

చేప ప్రసాద పంపిణీ ప్రశాంతంగా జరిగేందుకు పటిష్ట చర్యలు తీసుకున్నట్లు నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు.

చేప ప్రసాద పంపిణీ ప్రశాంతంగా జరిగేందుకు పటిష్ట చర్యలు
X

దిశ, హైదరాబాద్ బ్యూరో : చేప ప్రసాద పంపిణీ ప్రశాంతంగా జరిగేందుకు పటిష్ట చర్యలు తీసుకున్నట్లు నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జరిగే చేప ప్రసాదం వితరణ కార్యక్రమానికి సంబంధించిన భద్రతా ఏర్పాట్లను ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన క్యూలైన్లు, కౌంటర్లు, మినీ కమాండ్ కంట్రోల్ సెంటర్ పనితీరును ఆయన నిశితంగా పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సోమవారం రాత్రి 9 గంటల నుంచి ప్రారంభం కానున్న చేప మందు పంపిణీ కోసం బత్తిన కుటుంబ సభ్యులు, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేశాయన్నారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి ఇప్పటికే దాదాపు 25 వేల మందికి పైగా ప్రజలు ఈ ప్రసాదం కోసం వ‌చ్చారని, పంపిణీ ప్రశాంత‌ వాతావ‌ర‌ణంలో జ‌రిగేందుకు వీలుగా సుమారు వెయ్యి మంది పోలీసులతో బందోబ‌స్తును ఏర్పాటు చేశారని చెప్పారు.

ఎలాంటి దొంగతనాలు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా క్రైమ్ పార్టీలతో పాటు షీ టీమ్స్, టాస్క్‌ఫోర్స్ సిబ్బంది కూడా విధుల్లో ఉంటారని, వేర్వేరు రాష్ట్రాల నుంచి వచ్చిన వారి సౌకర్యార్థం పోలీస్ కమాండ్ కంట్రోల్ రూం ద్వారా తెలుగుతో పాటు ఒరియా, కన్నడ, మరాఠీ, గుజరాతీ వంటి వివిధ భాషల్లో అనౌన్స్‌మెంట్స్ చేయ‌డం జ‌రుగుతందని సీపీ వెల్లడించారు. రద్దీ వల్ల స్థానిక ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం కలగకుండా అవసరమైన మార్పులు చేశామని, అత్యవసర వైద్య సేవల కోసం ప్రత్యేకంగా మెడికల్ టీంలతో పాటు ఐదు అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచ‌డం జ‌రిగిందని, పంపిణీ వద్ద ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని, స్థానికంగా ఉండే ప్రజలు రద్దీని దృష్టిలో ఉంచుకుని మంగళవారం రావాలని కోరారు. తగినంత మొత్తంలో చేప ప్రసాదం అందుబాటులో ఉన్నందున ప్రసాదం దొరుకుతుందో లేదోనని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎలాంటి అపోహలు, పుకార్లను నమ్మవద్ద‌ని సీపీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. ప్రజలందరూ ప్రశాంతంగా ఉంటూ చేపప్ర‌సాద పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వానికి, పోలీసులకు స‌హ‌క‌రించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు సీపీ లా అండ్ ఆర్డర్ తఫ్సీర్ ఇక్బాల్, జాయింట్ సీపీ ట్రాఫిక్ డి.జోయల్ డేవిస్, డీసీపీలు ఆర్.వెంకటేశ్వర్లు, చంద్ర మోహన్, కాజల్ తదితరులు పాల్గొన్నారు.

Next Story