సర్కార్‌ ఎక్స్‌ప్రెస్‌లో దొంగల బీభత్సం: 5 తులాల బంగారం దోపిడీ

by Malleboina Mahesh |

సర్కార్‌ ఎక్స్‌ప్రెస్‌లో దొంగల బీభత్సం.. 5 తులాల బంగారం దోపిడీ. ప్రయాణికుల ప్రతిఘటనతో చైన్ లాగి పరార్.. దొంగలపై రైల్వే పోలీసుల కాల్పులు!

సర్కార్‌ ఎక్స్‌ప్రెస్‌లో దొంగల బీభత్సం: 5 తులాల బంగారం దోపిడీ
X

దిశ, వెబ్ డెస్క్: గత కొద్ది నెలలుగా సైలెంట్ గా ఉన్న రైలు దొంగలు (Train robbers) ఆదివారం రాత్రి రెచ్చిపోయారు. ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లా పరిధిలో రాత్రి వేళ రైలు ప్రయాణికులను భయభ్రాంతులకు గురి చేస్తూ భారీ దొంగతనం చేయడం కలకలం గా మారింది. చెంగల్‌పట్టు నుంచి కాకినాడ వెళ్తున్న ‘సర్కార్‌ ఎక్స్‌ప్రెస్‌’ రైలును లక్ష్యంగా చేసుకుని దోపిడీ దొంగలు ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. రైలు బాపట్ల సమీపంలోకి రాగానే బోగీలోకి చొరబడిన దుండగులు ప్రయాణికులను బెదిరించి, వారి వద్ద నుంచి సుమారు 5 తులాల బంగారు ఆభరణాలను బలవంతంగా లాక్కున్నట్లు తెలుస్తుంది. అయితే, దొంగల దోపిడీని ప్రయాణికులు ధైర్యంగా ప్రతిఘటించి గట్టిగా కేకలు వేయడంతో బోగీల్లో తీవ్ర కలకలం రేగింది. దీంతో అప్రమత్తమైన దొంగలు వెంటనే రైలు వ్యాక్యూమ్ చైన్ లాగి, అప్పికట్ల సమీపంలో రైలు ఆగగానే చీకట్లోకి దూకి పరారయ్యారు.

రైలు ఆగడం, దొంగలు పారిపోతుండటాన్ని గమనించిన రైల్వే రక్షణ దళం (RPF/GRP) పోలీసులు తక్షణమే స్పందించి దుండగులను పట్టుకునేందుకు వారిపై కాల్పులు జరిపారు. అయినప్పటికీ దొంగలు చీకటిని ఆసరాగా చేసుకుని సమీప పొలాల్లోకి పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న బాపట్ల జిల్లా పోలీసులు, రైల్వే పోలీసులు భారీగా ఘటనా స్థలానికి చేరుకుని పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పరారైన అంతర్రాష్ట్ర దోపిడీ ముఠా కోసం అప్పికట్ల - బత్తిపూడి గ్రామ పరిసరాల్లోని పొలాలు, తోటల్లో పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు (సెర్చ్ ఆపరేషన్) ముమ్మరం చేశారు. రైల్లో కాల్పులు జరగడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

Next Story