పాతబస్తీలో రోడ్డు విస్తరణ పనులు వేగవంతం.. ఆక్రమణలను తొలగించిన అధికారులు

by Malleboina Mahesh |

పాతబస్తీ ఛత్రినక పరిధిలో జీహెచ్‌ఎంసీ, హైడ్రా అధికారుల భారీ ఆపరేషన్. రోడ్డు విస్తరణలో భాగంగా అక్రమ నిర్మాణాల తొలగింపు. ట్రాఫిక్ కష్టాల నుండి విముక్తి.

పాతబస్తీలో రోడ్డు విస్తరణ పనులు వేగవంతం.. ఆక్రమణలను తొలగించిన అధికారులు
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ పాతబస్తీలో నిత్యం ఎదురయ్యే ట్రాఫిక్ రద్దీ సమస్యకు చెక్ పెడుతూ..రోడ్డు విస్తరణ పనులను వేగవంతం చేశారు. ఈ క్రమంలో శాశ్వత పరిష్కారం చూపే దిశగా జీహెచ్‌ఎంసీ (GHMC) అధికారులు అడుగులు వేశారు. శనివారం చాంద్రాయణగుట్ట నియోజకవర్గ పరిధిలోని ఛత్రినాక పాత పోలీస్ స్టేషన్ చౌరస్తా నుండి బోయిగూడ, కందికల్ గేట్ వరకు ప్రధాన రహదారిపై ఉన్న ఆక్రమణల తొలగింపు ప్రక్రియను చేపట్టారు. హైడ్రా (HYDRAA) మరియు పోలీసు అధికారుల సహకారంతో బల్దియా సిబ్బంది జేసీబీలతో అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశారు.

ప్రజాప్రతినిధుల సమక్షంలో ఆపరేషన్..

స్థానిక ప్రజా ప్రతినిధులు మరియు ఉన్నతాధికారుల సమక్షంలో జరిగిన ఈ తొలగింపు చర్యల్లో భాగంగా.. రోడ్డును ఆక్రమించి నిర్మించిన మెట్లు, ప్లాట్‌ఫామ్‌లు, అక్రమ షేడ్లను పూర్తిగా తొలగించారు. ఫుట్‌పాత్‌లను ఆక్రమించిన దుకాణాల వెలుపలి భాగాలను సైతం తొలగించడంతో రోడ్డు ఒక్కసారిగా వెడల్పు గా మారింది. ఈ చర్యల వల్ల అటు వాహనదారులకు, ఇటు పాదచారులకు ఏళ్ల తరబడి ఉన్న ఇబ్బందులు తొలగనున్నాయి.

మాస్టర్ ప్లాన్ ప్రకారం చర్యలు..

ఈ సందర్భంగా జీహెచ్‌ఎంసీ అధికారులు మాట్లాడుతూ.. నగర మాస్టర్ ప్లాన్ ప్రకారం ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ఈ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఇళ్ల యజమానులకు, దుకాణదారులకు ముందస్తు నోటీసులు ఇచ్చిన తర్వాతే చట్టప్రకారం చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. బాధితులు తమ డాక్యుమెంట్ల ప్రకారం సెట్ బ్యాక్ వదలాలని, అభివృద్ధి పనులకు ప్రజలు సహకరించాలని కోరారు. త్వరలోనే రోడ్డుపై ఉన్న శిథిలాలను తొలగించి, రహదారిని చక్కదిద్దుతామని అధికారులు వెల్లడించారు.

Next Story