- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆస్తి కోసం అన్నదమ్ముల మధ్య చిచ్చు
తల్లిదండ్రుల మరణం తర్వాత ఆప్యాయంగా ఉండాల్సిన అన్నదమ్ముల మధ్య ఆస్తి వివాదం తీవ్ర ఘర్షణకు దారితీసింది.

దిశ, టేకులపల్లి : తల్లిదండ్రుల మరణం తర్వాత ఆప్యాయంగా ఉండాల్సిన అన్నదమ్ముల మధ్య ఆస్తి వివాదం తీవ్ర ఘర్షణకు దారితీసింది. టేకులపల్లి మండలం దాస్ తండా పంచాయతీ పరిధిలోని రేగుల తండా గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. గ్రామానికి చెందిన తేజావత్ కిషన్, మాజీ దంపతులకు మోహన్, శోభన్, సుమన్ అనే ముగ్గురు కుమారులు ఉన్నారు. 2021లో తల్లి, 2025లో తండ్రి మరణించడంతో కుటుంబ ఆస్తుల పంపకాల అంశం తెరపైకి వచ్చింది. తల్లిదండ్రులు వదిలి వెళ్లిన భూములు, బంగారం తదితర ఆస్తులను సమానంగా పంచుకోవాలని పెద్దన్న మోహన్ సూచించగా, అదే వివాదానికి కారణమైందని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన నెహ్రూ అనే వ్యక్తి జోక్యంతో తమ్ముళ్లు శోభన్, సుమన్‌లతో కలిసి మోహన్ కుటుంబం పై కక్ష పెంచుకున్నారని తెలుస్తోంది. గత ఏప్రిల్ 14న తమకు ప్రాణహాని ఉందంటూ మోహన్, అతని భార్య మీనాక్షి టేకులపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ పరిస్థితి మారలేదని వారు చెబుతున్నారు. ఇటీవల వివాదాస్పద వ్యవసాయ భూమిని దున్నేందుకు శోభన్, సుమన్ సిద్ధమవగా, తమ వాటా ఇవ్వక ముందు పనులు చేయవద్దని మోహన్ దంపతులు అడ్డుకున్నట్లు సమాచారం.
దీంతో అక్కడ తీవ్రవాగ్వాదం చోటుచేసుకుని, ఆగ్రహంతో తమ్ముళ్లు ట్రాక్టర్‌ను వారిపైకి దూసుకెళ్లడంతో పాటు కర్రలతో దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనలో మోహన్ చేతి ఎముక విరగగా, మీనాక్షికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన పై మే 30న బాధితులు మరోసారి పోలీసులను ఆశ్రయించగా, విచారణ అనంతరం జూన్ 8న ఐదుగురి పై కేసు నమోదు చేసినట్లు తెలిసింది. ప్రధాన నిందితులైన శోభన్, సుమన్‌లను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించగా, వారు మరుసటి రోజే బెయిల్‌పై విడుదలయ్యారు. అయితే బెయిల్ పై బయటకు వచ్చిన తర్వాత కూడా తమను బెదిరింపులకు గురిచేస్తున్నారని మోహన్ దంపతులు ఆరోపిస్తున్నారు. కేసులు పెట్టి జైలుకు పంపిస్తారా.. మీ అంతు చూస్తాం.. మీకు ఆస్తిలో ఒక్క పైసా కూడా రానివ్వం” అంటూ బహిరంగంగా హెచ్చరిస్తున్నారని తెలిపారు. అలాగే నెహ్రూ, అతని కుమారుడు కూడా ప్రాణహాని కలిగించేలా బెదిరింపులు చేస్తున్నారని వాపోయారు. తమ్ముళ్ల నుంచే ప్రాణహాని పొంచి ఉందన్న భయంతో జీవిస్తున్నామని, తమకు పోలీసు రక్షణ కల్పించి నిందితుల పై కఠిన చర్యలు తీసుకోవాలని మోహన్, మీనాక్షి దంపతులు పోలీసు ఉన్నతాధికారులను కోరుతున్నారు.






