బీఆర్ఎస్ రద్దు అయిన వెయ్యి నోటు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |   (  Updated:2026-06-10 14:24:27  IST  )

హైదరాబాద్‌లో భారత్ ఫ్యూచర్ సిటీ అభివృద్ధి సంస్థ (FCDA) కార్యాలయాన్ని, లోగోను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.

బీఆర్ఎస్ రద్దు అయిన వెయ్యి నోటు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణను అంతర్జాతీయ పటంలో మరోస్థాయికి తీసుకెళ్లే ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ సాకారం దిశగా కీలక అడుగు వేసింది. ఫ్యూచర్ సిటీ ప్రణాళికలు, పనులను వేగవంతం చేసేందుకు ఏర్పాటు చేసిన ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ (FCDA) ప్రధాన కార్యాలయాన్ని ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థకు సంబంధించిన అధికారిక లోగో, నూతన వెబ్‌సైట్‌ను కూడా సీఎం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో పాటు పలువురు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఫ్యూచర్ సిటీని అడ్డుకునేందుకు కొన్ని శక్తులు..

ఎఫ్‌డీసీఏ కార్యాలయ ప్రారంభోత్సవం అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. నాడు కులీ కుతుబ్‌షా, నిజాం రాజులు దార్శనికతతో హైదరాబాద్ నగరాన్ని విస్తరించడం వల్లే ఇవాళ నగరానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు వచ్చింది. వారి తర్వాత ఐటీ రంగానికి పునాది పడిందని అన్నారు. గతంలో హైటెక్ సిటీ నిర్మిస్తుంటే కొందరు నవ్వి ఎగతాళి చేశారని, ప్రయాణాలను సులభతరం చేసే ఔటర్ రింగు రోడ్డు (ORR) నిర్మాణాన్ని కూడా తీవ్రంగా అడ్డుకున్నారని సీఎం గుర్తుచేశారు. ఆనాడు హైదరాబాద్ అభివృద్ధి చెందకూడదని కుట్రలు, కుతంత్రాలు చేసిన శక్తులే.. ఇప్పుడు తాము నిర్మిస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీ‌ని కూడా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా, రాజకీయంగా ఎలాంటి కుట్రలు పన్నినా భారత్ ఫ్యూచర్ సిటీ అభివృద్ధిని ఆపే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.

‘రంగారెడ్డి’ భూముల విలువ ఎక్కువ..

ఇక రాష్ట్ర ఆదాయంలో 60 శాతం ఆదాయం హైదరాబాద్ నుంచే వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బంగారం కంటే రంగారెడ్డి జిల్లా భూముల విలువ ఎక్కువని తెలిపారు. ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని అంటున్న వారికి భవిష్యత్తు ఉండదని అన్నారు. బీఆర్ఎస్ రద్దు అయిన వెయ్యి నోటు.. అందుకే ప్రజలకు తిరస్కరించారని సెటైర్లు చేశారు. వచ్చే 8 ఏళ్లలో న్యూయార్క్, సింగపూర్‌తో పోటీ పడేలా ఫ్యూచర్ సిటీని రూపొందిస్తామని అన్నారు. బీఆర్ఎస్ ఇలాగే ప్రవర్తిస్తే వచ్చేసారి ప్రతిపక్ష హోదా కూడా రాదని ధ్వజమెత్తారు. 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీకి ఫ్యూచర్ సిటీ అభివృద్ధి కావాలన్నారు. రేపటి భవిష్యత్తుకు ఈనాడే పునాది వేశామని తెలిపారు. నిన్న 2 గంటల వానకే హైదరాబాద్‌లో నీరు నిలిచిపోయిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ నగరం అని గొప్పగా చెప్పుకుంటే సరిపోదని.. ఇదేనా బీఆర్ఎస్ పదేళ్ల అభివృద్ధి అంటూ ఎద్దేవా చేశారు. రోడ్లపై వరద పారుతుంటే ఎవరిది బాధ్యత.. ఈ వరద పరిస్థితి వాళ్ల కబ్జాల పుణ్యమే కదా అని అన్నారు. పదేళ్లు రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామన్న వాళ్లు హైదరాబాద్‌లో వరదపై మాట్లాడాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

Next Story