మహిళా సంఘాలకు రైస్ మిల్లులు

by Ratna Kumari |

రాష్ట్రంలోని మహిళా సంఘాల అభ్యున్నతే లక్ష్యంగా కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే దిశగా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా పనిచేస్తోందని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

మహిళా సంఘాలకు రైస్ మిల్లులు
X

దిశ, నేలకొండపల్లి : రాష్ట్రంలోని మహిళా సంఘాల అభ్యున్నతే లక్ష్యంగా కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే దిశగా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా పనిచేస్తోందని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లి మండలం అప్పలనర్సింహాపురం, రాజారాంపేట, కోరట్లగూడెం గ్రామాల్లో ఆదివారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. మహిళా సంఘాలకు రైస్ మిల్లులను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిన మంత్రి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనల మేరకు రాష్ట్రంలోనే తొలిసారిగా నేలకొండపల్లి మండలంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో రైస్ మిల్లును ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే మహిళా సంఘాలు ఆర్టీసీ బస్సులు, పెట్రోల్ బంకులను సమర్థవంతంగా నిర్వహిస్తున్నాయని, వారికి రూ.63 వేల కోట్ల రుణాలను ప్రభుత్వం అందించిందన్నారు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి జోడెడ్లలా సాగుతున్నాయని పేర్కొన్నారు. తడిసిన ప్రతి గింజతో పాటు పండిన ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వం కొనుగోలు చేసి, వారంలోపే రైతుల ఖాతాల్లో నగదు జమ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. రైతులకు గతంలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామన్నారు. పేదలకు సన్నబియ్యం పంపిణీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి పథకాలను ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తోందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల కింద ఇప్పటికే 4.5 లక్షల ఇళ్లను మంజూరు చేశామని, త్వరలోనే రెండో, మూడో, నాలుగో విడతల ఇళ్లను కూడా మంజూరు చేయనున్నట్లు తెలిపారు. ఇళ్ల నిర్మాణ పురోగతిని బట్టి ప్రతి సోమవారం బిల్లులు చెల్లిస్తున్నామని చెప్పారు. ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో రైతులు నీటి వినియోగాన్ని దృష్టిలో ఉంచుకుని తక్కువ నీరు అవసరమయ్యే పంటలను సాగు చేయాలని మంత్రి సూచించారు. ఈ కార్యక్రమాల్లో ఇల్లందు, భద్రాచలం, అశ్వారావుపేట, పినపాక నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో పాటు జిల్లా, మండల స్థాయి ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

Next Story