తొలకరి పలకరింపు.. పొలం బాట పట్టిన రైతన్న

by Taduka Kalyani |

రోహిణి కార్తె ఎండలకు అలసిన నేలను తొలకరి చినుకులు తాకడంతో రైతన్న ముఖంలో ఆనందం వెల్లివిరిసింది

తొలకరి పలకరింపు.. పొలం బాట పట్టిన రైతన్న
X

దిశ, ఖానాపూర్:- రోహిణి కార్తె ఎండలకు అలసిన నేలను తొలకరి చినుకులు తాకడంతో రైతన్న ముఖంలో ఆనందం వెల్లివిరిసింది. రెండు రోజుల క్రితం కురిసిన వర్షంతో ఖానాపూర్ మండలంలోని పొలాలన్నీ ఒక్కసారిగా కళకళలాడుతున్నాయి. ఖరీఫ్ సీజన్‌కు స్వాగతం పలుకుతూ రైతులు వ్యవసాయ పనుల్లో బిజీబిజీగా మారారు. వారం రోజులుగా వరుణుడి కోసం ఎదురుచూసిన రైతన్నకు తొలకరి వర్షం కొండంత ధైర్యాన్నిచ్చింది. మృగశిర కార్తె ప్రవేశానికి ముందే వర్షం పడడంతో ఆరుతడి పంటలు సాగు చేసే రైతులు ట్రాక్టర్లతో దుక్కి దున్నడం, నేల చదును పనులు ముమ్మరం చేశారు. పసుపు, మొక్కజొన్న, పత్తి, కంది, సోయాబీన్ విత్తనాలు వేసేందుకు భూమిని సిద్ధం చేశారు. పొలాల్లోని కలుపు మొక్కలు, చెత్తాచెదారం తొలగించి విత్తనశయ్యలు తయారు చేసి, విత్తేందుకు రైతులు సిద్ధమయ్యారు. మండలంలోని దాదాపు 19,500 ఎకరాల సాగు విస్తీర్ణంలో ఎక్కడ చూసినా రైతుల సందడే కనిపిస్తోంది. ముందస్తుగా ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసి పెట్టుకున్న రైతులు, తడిసిన నేలలో విత్తనాలు వేసే పనుల్లో నిమగ్నమయ్యారు.వ్యవసాయ మార్కెట్లు, విత్తన దుకాణాల వద్ద రద్దీ పెరిగింది. మృగశిర కార్తెలో విత్తనం వేస్తే దిగుబడి బాగా వస్తుందనే నమ్మకంతో రైతులు తొందరపడుతున్నారు. తొలకరి పడింది, భూమి చల్లబడింది. ఇక ఆలస్యం చేస్తే నష్టం. మంచి వర్షం పడగానే విత్తనం వేసేశాం. ఈ ఏడాది వరుణుడు కరుణిస్తే పంటలు బాగా పండుతాయి అని మండలం లోని సూర్జాపూర్ గ్రామ రైతులు తోకల వెంకటేష్,వంగ రాజన్న ఆనందం వ్యక్తం చేశాడు. వ్యవసాయ అధికారులు సైతం రైతులకు విత్తన ఎంపిక, సాగు పద్ధతులపై సూచనలు చేస్తున్నారు. తొలకరి వర్షంతో పల్లెలన్నీ పచ్చదనం వైపు అడుగులు వేస్తున్నాయి.

Next Story