కనగల్‌లో రహదారి అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన

by Ratna Kumari |

రహదారులు, భవనాల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా రూ.13,006 కోట్ల వ్యయంతో 6,092.37 కిలోమీటర్ల మేర హెచ్‌ఏఎమ్ (HAM) విధానంలో 441 రహదారుల నిర్మాణం, బలోపేతం పనులకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కనగల్ మండల కేంద్రంలో శంకుస్థాపన చేశారు.

కనగల్‌లో రహదారి అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన
X

దిశ, కనగల్ : రహదారులు, భవనాల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా రూ.13,006 కోట్ల వ్యయంతో 6,092.37 కిలోమీటర్ల మేర హెచ్‌ఏఎమ్ (HAM) విధానంలో 441 రహదారుల నిర్మాణం, బలోపేతం పనులకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆదివారం కనగల్ మండల కేంద్రంలో శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి మధ్యాహ్నం 3:45 గంటలకు హెలికాప్టర్ ద్వారా కనగల్‌కు చేరుకున్నారు. అనంతరం 3:55 గంటలకు ప్రాజెక్టుకు సంబంధించిన పైలాన్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రహదారుల అభివృద్ధి పనులకు అధికారికంగా శ్రీకారం చుట్టారు. అనంతరం సుమారు 4:10 గంటలకు తిరిగి హెలికాప్టర్‌లో బయలుదేరి వెళ్లారు. కనగల్ మండల కేంద్రంలో సుమారు 25 నిమిషాల పాటు గడిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రోడ్డు వెంట నిలబడి ఉన్న ప్రజల వద్దకు వెళ్లి వారితో ముచ్చటించి, షేక్‌హ్యాండ్ ఇచ్చారు. దీంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ధర్వేశిపురం ఎల్లమ్మ ఆలయం తరఫున ఆలయ చైర్మన్ చీదేటి వెంకటరెడ్డి, ఈవో నాగిరెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎల్లమ్మ తల్లి చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రోడ్లు-భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, నల్గొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి, ఆర్ అండ్ బి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం చేపడుతున్న ఈ భారీ ప్రాజెక్టుతో రాష్ట్రవ్యాప్తంగా రహదారి మౌలిక వసతులు మరింత మెరుగుపడతాయని నాయకులు పేర్కొన్నారు.

Next Story