బీఆర్ఎస్‌కు గతమే కానీ భవిష్యత్తు లేదు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |   (  Updated:2026-06-28 13:02:22  IST  )

పదేళ్ల బీఆర్ఎస్ పాలనపై.. రెండున్నరేళ్ల ప్రజా పాలనపై అసెంబ్లీ వేదికగా చర్చకు సిద్ధమా అంటూ బీఆర్ఎస్ పార్టీకి సీఎం రేవంత్ రెడ్డి సంచలన సవాలు విసిరారు.

బీఆర్ఎస్‌కు గతమే కానీ భవిష్యత్తు లేదు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రజా పాలనకు నాలుగు కోట్ల ప్రజల ఆశీర్వాదం ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ నల్లగొండ జిల్లాలో పర్యటించిన ఆయన సుమారు రూ.13 వేల కోట్లతో ఆర్ అండ్ బీ చేపట్టనున్న హ్యామ్ రోడ్ల నిర్మాణ పనులకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో కలిసి శ్రీకారం చుట్టారు. నల్గొండ జిల్లా కనగల్‌ వేదికగా హ్యామ్ రోడ్ల పైలాన్‌ను సీఎం ఆవిష్కరించారు. అదేవిధంగా నల్గొండ కార్పొరేషన్‌లో తొలిదశ తాగునీటి ప్రాజెక్టు పనులకు, రూ.83 కోట్లతో తొలిదశ తాగునీటి శుద్ధి కేంద్రం పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం జిల్లాలోని పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఎన్‌జీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసే బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. నాడు తెలంగాణ కోసం మంత్రి పదవిని త్యాగం చేసిన నాయకులు కొండా లక్ష్మణ్ బాపూజీ అని.. ఆయన తర్వాత మళ్లీ పదవీ త్యాగం చేసిన ఏకైక వ్యక్తి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అని అన్నారు.

బీఆర్ఎస్ త్యాగం.. ఎలక్షన్, సెలక్షన్, కలెక్షన్..

బీఆర్ఎస్ త్యాగం అంటే ఎలక్షన్, సెలక్షన్, కలెక్షన్ అని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. త్యాగం అంటే 1969లో పదవిని వదులుకున్న కొండ లక్ష్మణ్ బాపూజీది అని, మలి దశ ఉద్యమంలో పదవీ త్యాగం చేసింది కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిది అసలైన త్యాగమని తెలిపారు. వందల మంది త్యాగాలు చేసి తెలంగాణ సాధిస్తే.. ఆ త్యాగాన్ని టీఆర్ఎస్ వాళ్లు తమ ఖాతాలో నిస్సిగ్గుగా వేసుకున్నారని ధ్వజమెత్తారు. పెట్రోల్ పోసుకుని ప్రాణార్పణ చేసిన శ్రీకాంతా చారిని ఏమనాలని అన్నారు. ఏ పదవులు ఆశించకుండా ప్రాణాలర్పించిన వారివి త్యాగాలు కావా అని ప్రశ్నించారు. ఇక వంద రూపాయాల పెట్రోల్ మీద పోసుకున్న అగ్గిపెట్టెరావుది త్యాగం కాదని, వేల కోట్లు దోచుకున్నారంటూ పరోక్షంగా హరీశ్ రావుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో వందేళ్ల విధ్వంసం చేసింది కల్వకుంట్ల ఫ్యామిలీ అని కామెంట్ చేశారు. తోడేళ్లలా ఇద్దరు తెలంగాణలో తిరుగుతున్నారంటూ కేటీఆర్, హరీశ్‌ రావులను ఉద్దేశించి ఫైర్ అయ్యారు. ఏది ఏమైనా ప్రజా పాలనకు నాలుగు కోట్ల ప్రజల ఆశీర్వాదం ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

పేదోళ్లకు ఇళ్లు కట్టిస్తుంటే ఓరుస్తలేరు..

కల్వకుంట్ల కుటుంబ అవినీతిని చూసే ప్రజలు ఆ కుటుంబాన్ని శాశ్వతంగా బహిష్కరించారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మళ్లీ వారికి పదవులు ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా లేరని తెలిపారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో తన మంత్రివర్గంలో ఒక్క మహిళకు కూడా చోటు ఇవ్వలేదని ఆరోపించారు. కానీ, తాము అధికారంలోకి వచ్చాక ఏటా రూ.16 వేల కోట్లు ఖర్చు చేస్తూ నిరుపేదలకు సన్నబియ్యం ఇస్తున్నాయని అన్నారు. పదేళ్ల పాటు బీఆర్ఎస్ పాలనలో ఏనాడూ పేదల గురించి పట్టించుకోలేదని.. వాళ్లు మాత్రం ఫామ్‌హౌస్‌లు కట్టుకున్నారని విమర్శించారు. ప్రతి గ్రామంలో పేదలకు ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తుంటే బీఆర్ఎస్ వాళ్ల కడుపు మండుతోందని తెలిపారు. 30 నెలల్లోనే రైతులు ఖాతాల్లో రూ.1.56 లక్షల కోట్లు జమ చేసి అన్నదాతలను దన్నుగా నిలిచామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

SLBCని పదేళ్లు పడావ్ పెట్టిన దుర్మార్గులు..

బీఆర్ఎస్‌కు గతమే కానీ భవిష్యత్తు లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆ పార్టీకి ఉప్పుపాతర వేశామని.. మళ్లీ మొక్క కూడా మొలవనీయ్యమని ప్రజలే అంటున్నారని కామెంట్ చేశారు. అధికారం పోయిన అక్కసుతో మూసీ కాలుష్యం కంటే కడుపులో విషం నింపుకున్నారని ఫైర్ అయ్యారు. అదేవిధంగా పదేళ్ల బీఆర్ఎస్ పాలన.. రెండున్నరేళ్ల తమ పాలనపై చర్చకు సిద్ధమా అని సవాలు విసిరారు. స్పీకర్‌కు లేఖ రాయండి.. మేనిఫెస్టోలపై అడిగినన్ని రోజులు అసెంబ్లీ వేదికగా చర్చిద్దామని సీఎం సంచలన సవాలు విరిరారు. నేడు ఫామ్‌హౌస్‌లో ఉన్న కేసీఆర్ తింటున్న సన్న బియ్యమే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మా పేదలు తింటున్నారని తెలిపారు. అనుమానం ఉంటే కేటీఆర్ తండాలకు వెళ్లి చూసుకోవచ్చని అన్నారు. ఎస్ఎల్‌బీసీని పదేళ్లు పడావ్ పెట్టిన దుర్మార్గులు బీఆర్ఎస్ నేతలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తులసి వనంలో గంజాయి మొక్కలాగా సూర్యాపేటలో ఒక జానెడు ఉన్న వ్యక్తి మిగిలిండని.. వచ్చే ఎన్నికల్లో ఆయనను కూడా గెలవనియ్యబోమని సీఎం రేవంత్ రెడ్డి ఛాలెంజ్ చేశారు.

Next Story