ఆదివాసీలు కార్లలో తిరగొద్దా.. అడవిలోనే ఉండాలా..? : ఎమ్మెల్యే

by Taduka Kalyani |

పేద ఇందిరమ్మ నుంచి ఇంటి నుంచి ఆదివాసీ ప్రజాప్రతినిధిగా తాను పెద్ద కారులో కనిపిస్తే ప్రతిపక్షాలు ఇంతలా తట్టుకోలేకపోతున్నాయని ఖానాపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆదివాసీలు కార్లలో తిరగొద్దా.. అడవిలోనే ఉండాలా..? : ఎమ్మెల్యే
X

దిశ, ప్రతినిధి నిర్మల్ : పేద ఇందిరమ్మ నుంచి ఇంటి నుంచి ఆదివాసీ ప్రజాప్రతినిధిగా తాను పెద్ద కారులో కనిపిస్తే ప్రతిపక్షాలు ఇంతలా తట్టుకోలేకపోతున్నాయని ఖానాపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మల్ లో మంత్రి జూపల్లి కృష్ణారావు జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆదివాసీలు, దళితులు ఎప్పటికీ కార్లలో తిరగకూడదా... అడవిలోనే ఉండిపోవాలా అని ఆయన ప్రతిపక్షాలపై మండిపడ్డారు. రూ. 3 కోట్లు పెట్టి లగ్జరీ కారు కొన్నారంటూ సామాజిక మాధ్యమాల్లో, రాజకీయ వర్గాల్లో తనపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. తన కారు ప్రమాదానికి గురైనప్పుడు, పుట్టినరోజు వేడుకల కోసం ఒక మిత్రుడు సహాయంగా ఇచ్చిన కారును తప్పుగా చిత్రీకరించడం వెనుక ఉన్న కుట్రలను ఖండించారు.

​కేటీఆర్ వ్యాఖ్యలపై తీవ్ర ధ్వజం

​ఈ వివాదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం స్పందించడాన్ని ఎమ్మెల్యే బొజ్జు తీవ్రంగా తప్పుబట్టారు. ఒక ఆదివాసీ బిడ్డ, ఒక దళిత బిడ్డ ఇలాంటి పెద్ద కార్లను ముట్టుకోవడం తప్పా అని ఆయన ప్రశ్నించారు. తాము కార్లలో కూర్చోవడం పాపమా అని ఆవేదన వ్యక్తం చేస్తూ, ఒక ఆదివాసీ బిడ్డకు కనీసం లగ్జరీ కారులో కూర్చునే అర్హత కూడా లేదన్నట్టుగా కేటీఆర్ మాట్లాడటం ఆయన అహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు.

​నేను అప్పుల్లోనే ఉన్నా...

​తాను ఉద్యమాల నుంచి వచ్చిన వాడినని, ఎన్నికల కంటే ముందు ప్రచారం కోసం కేవలం 10 లక్షల రూపాయల అప్పు ఉంటే, నియోజకవర్గ ప్రజలు, ఉపాధ్యాయులు చందాలు వేసి గెలిపించారని భావోద్వేగంతో గుర్తుచేశారు. ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా తన గౌరవాన్ని, నియోజకవర్గ కార్యకర్తల నైతిక బలాన్ని కాపాడేందుకు తాను ఇంకా రూ. 2 కోట్ల అప్పుల్లోనే ఉన్నానని స్పష్టం చేశారు. తన నియోజకవర్గంలో ఎలాంటి అక్రమ సంపాదనకు, మైనింగ్, సాండ్ క్వారీలు లేదా రియల్ ఎస్టేట్ దందాలకు తావులేదని ఆయన కుండబద్దలు కొట్టారు.

Next Story