బతికున్న వ్యక్తిని రికార్డుల్లో చంపేసి అక్రమ పట్టా!

by Kodari Anjali |

మంథని మండలంలో రెవెన్యూ అధికారుల అవినీతి బాగోతం వెలుగుచూసింది.

బతికున్న వ్యక్తిని రికార్డుల్లో చంపేసి అక్రమ పట్టా!
X

దిశ, మంథని: మంథని మండలంలో రెవెన్యూ అధికారుల అవినీతి బాగోతం వెలుగుచూసింది. ఏకంగా బతికున్న వ్యక్తిని చనిపోయినట్లు తప్పుడు రికార్డులు సృష్టించి, ఆ భూమిని వేరొకరి పేరిట అక్రమంగా పట్టా చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ భారీ భూ కుంభకోణానికి బాధ్యులైన మంథని ఆర్డీవో, ఎమ్మార్వోలను తక్షణమే సస్పెండ్ చేయాలని, గత రెండేళ్లలో జరిగిన రిజిస్ట్రేషన్ల పై సమగ్ర విచారణ జరపాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. స్థానిక ప్రజా సంఘాల కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఆర్ల సందీప్, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు గొర్రెంకల సురేష్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం 'భూభారతి' అంటూ గొప్పలు చెబుతుంటే, మంథనిలో మాత్రం అధికారులు కాసులకు కక్కుర్తి పడి పేదల భూములను అక్రమంగా ఇతరులకు కట్టబెడుతున్నారని మండిపడ్డారు. మంథని శివారులోని సర్వే నంబర్ 183/ఏ/1,183/ఏ/2 కు సంబంధించిన వ్యవసాయ భూమి విషయంలో భారీ కుంభకోణం జరిగింది.

ఆఫీసుల చుట్టూ తిరుగుతుంటే...

రెవెన్యూ అధికారుల అండదండలతో ఖానాపూర్ గ్రామానికి చెందిన బతికున్న ఒక వ్యక్తిని చనిపోయినట్లుగా రికార్డుల్లో చూపిస్తూ, తప్పుడు మరణ ధ్రువీకరణ పత్రాలతో ఆ భూమిని వేరొకరికి విరాసత్ (వారసత్వ) పేరిట అక్రమంగా పట్టా చేశారని నాయకులు ఆరోపించారు.సాధారణ పేద రైతులు కుల, మరణ ధ్రువీకరణ పత్రాల కోసం, ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న పట్టాల కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతుంటే నిబంధనల పేరుతో తిప్పించుకునే ఎమ్మార్వో... ఇంత పెద్ద అక్రమం జరుగుతుంటే ఎలా చూస్తూ ఊరుకున్నారని ఈ సందర్బంగా వారు ప్రశ్నించారు. ఈ భూ కుంభకోణం బయటపడటంతో ఎమ్మార్వో తన కార్యాలయానికి రాకుండా ఆర్డీవో ఆఫీసులో తలదాచుకోవడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. ఈ వ్యవహారంలో ఉన్నతాధికారుల తప్పులను కప్పిపుచ్చుతూ, గుట్టుచప్పుడు కాకుండా కింది స్థాయి అధికారులైన జీపీవో, ఆర్ఐలను మాత్రమే సస్పెండ్ చేయడం విచారకరం అన్నారు. ఈ వ్యవహారంలో రెవెన్యూ డీటీ పాత్రపై కూడా విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తాం..

గత రెండేళ్ల వ్యవధిలో మంథని రెవెన్యూ ఉన్నతాధికారుల కనుసన్నల్లో జరిగిన భూ మ్యూటేషన్లు,పట్టాల మార్పులన్నింటిపైనా సమగ్ర ఆడిట్ నిర్వహించాలని నాయకులు కోరారు. ఖానాపూర్ భూ వివాదంపై జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో విచారణ జరిపి, కుంభకోణంలో కీలక పాత్ర వహించిన ఆర్డీవో, ఎమ్మార్వోలను వెంటనే సస్పెండ్ చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఈ కుంభకోణంపై రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీకి, రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బూడిద గణేష్, జిల్లా ఉపాధ్యక్షులు ఏల్పుల సురేష్, నాయకులు బాబు రవి తదితరులు పాల్గొన్నారు.

Next Story