యాదిరెడ్డి కుటుంబానికి బీఆర్ఎస్ అండ..

by Taduka Kalyani |

తెలంగాణ అమరవీరుడు మందడి యాదిరెడ్డి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు

యాదిరెడ్డి కుటుంబానికి బీఆర్ఎస్ అండ..
X

దిశ, మొయినాబాద్ : తెలంగాణ అమరవీరుడు మందడి యాదిరెడ్డి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆదివారం మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌తో కలిసి మొయినాబాద్ మున్సిపాలిటీ పెద్దమంగళారం గ్రామంలో యాదిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా యాదిరెడ్డి సోదరుడు ఓం రెడ్డి కుమార్తెకు గొంతు సమస్య ఉందని తల్లి చంద్రమ్మ వివరించగా, చిన్నారి సర్జరీకి అయ్యే మొత్తం ఖర్చును భరిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు.

యాదిరెడ్డి సేవలు చిరస్మరణీయం

అనంతరం మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. తెలంగాణ కోసం యాదిరెడ్డి ఢిల్లీలో ఆత్మబలిదానం చేసుకోవడం చరిత్రలో నిలిచిపోయే ఘటన అని పేర్కొన్నారు. తమ ప్రభుత్వ హయాంలో యాదిరెడ్డి కుటుంబంలోని ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, రూ.10 లక్షల ఆర్థిక సాయం, 500 గజాల ఇంటి స్థలం అందించామని గుర్తు చేశారు. అలాగే ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఎన్కేపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త డప్పు కరంచంద్ కుటుంబాన్ని పరామర్శించి, ముగ్గురు పిల్లల పేరిట ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయించడంతో పాటు ఆయన భార్యకు ప్రైవేట్ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. పిల్లలను ఉన్నతంగా చదివించాలని కుటుంబ సభ్యులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు కొంపల్లి అనంతరెడ్డి, కొత్త నరసింహారెడ్డి, దేశమోళ్ల ఆంజనేయులు, మొయినాబాద్, చేవెళ్ల మండలాల అధ్యక్షులు దారెడ్డి వెంకటరెడ్డి, ప్రభాకర్, సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షుడు కోట్ల నరోత్తం రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షుడు మొర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Next Story