తెలంగాణ అభివృద్ధిలో చారిత్రాత్మక అడుగు

by Ratna Kumari |

రాష్ట్రంలో రహదారుల నెట్‌వర్క్‌ను బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ తెలిపారు.

తెలంగాణ అభివృద్ధిలో చారిత్రాత్మక అడుగు
X

దిశ, దేవరకొండ టౌన్ : రాష్ట్రంలో రహదారుల నెట్‌వర్క్‌ను బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ తెలిపారు. నల్లగొండ జిల్లా కనగల్‌లో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి రూ.13,006 కోట్ల భారీ వ్యయంతో చేపట్టనున్న హ్యామ్ రోడ్ల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడం తెలంగాణ అభివృద్ధి ప్రస్థానంలో ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దేవరకొండ నియోజకవర్గ ప్రజల తరఫున ఎమ్మెల్యే బాలు నాయక్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్య మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా రూ.13,006 కోట్ల నిధులతో 6,092 కిలోమీటర్ల మేర 441 రహదారులను అభివృద్ధి చేయాలనే ప్రభుత్వ నిర్ణయం విప్లవాత్మకమని అన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య రవాణా అనుసంధానత మరింత మెరుగుపడుతుందని చెప్పారు. అధునాతన రహదారుల నిర్మాణం వల్ల ప్రజలకు సురక్షితమైన, వేగవంతమైన ప్రయాణ సౌకర్యాలు లభించడమే కాకుండా వ్యవసాయం, వ్యాపారం, పారిశ్రామిక రంగాలు కూడా వేగంగా అభివృద్ధి చెందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితం కాకుండా ప్రజల సంక్షేమం, మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తోందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ భారీ రహదారి ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణ రవాణా వ్యవస్థ సరికొత్త రూపు సంతరించుకుంటుందని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్ర పురోగతికి బాటలు వేస్తున్నాయని ఎమ్మెల్యే బాలు నాయక్ పేర్కొన్నారు.

Next Story