ఉపాధ్యాయులకు అలర్ట్.. డెప్యుటేషన్‌పై 229 లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

by Prasad Jukanti |   (  Updated:2026-06-28 12:44:56  IST  )

తెలంగాణ ఎస్‌సీఈఆర్‌టీ, డీఐఈటీల్లో ఖాళీగా ఉన్న 229 లెక్చరర్ పోస్టులను డెప్యుటేషన్‌పై భర్తీ చేసేందుకు విద్యాశాఖ నోటిఫికేషన్ ఇచ్చింది

ఉపాధ్యాయులకు అలర్ట్.. డెప్యుటేషన్‌పై 229 లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలోని ప్రభుత్వ డీఐఈటీలు (DIETs), సీటీఈలు (CTEs), ఐఏఎస్‌ఈలు (IASE), ఎస్‌సీఈఆర్‌టీ (SCERT)ల్లో చాలా కాలంగా ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను తాత్కాలికంగా భర్తీ చేసేందుకు తెలంగాణ పాఠశాల విద్యాశాఖ నోటిపికేషన్ జారీ చేసింది. వీటిల్లో మొత్తం ఖాళీగా ఉన్న 229 లెక్చరర్/ప్రొఫెసర్ పోస్టుల భర్తీ కోసం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. గెజిటెడ్ హెడ్‌మాస్టర్లు (HMs), స్కూల్ అసిస్టెంట్లను ఫారిన్ సర్వీస్ (డిప్యుటేషన్) నిబంధనలపై ఏడాది పాటు లేదా రెగ్యులర్ నియామకాలు జరిగే వరకు వీరిని పదవుల్లో కొనసాగించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ విద్యా సంస్థలలో చాలా కాలంగా అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉండటం వల్ల విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అకడమిక్ కార్యక్రమాలు ఎలాంటి అంతరాయం లేకుండా సాగేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

ఎంపిక విధానం ఇలా...

మొత్తం 229 ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ వెలువడగా ఇందులో DIET, CTE, IASE లలో ఖాళీలు 211 పోస్టులు, SCERT లో ఖాళీలు 18 పోస్టులు ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ మరియు స్థానిక సంస్థల (Local Body) పాఠశాలల్లో పనిచేస్తున్న ఇన్-సర్వీస్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లు ఈ పోస్టులకు అర్హులుగా పేర్కొంది. అభ్యర్థులను కంప్యూటర్ ఆధారిత పరీక్ష మరియు ఇంటర్వ్యూ/డెమోన్స్ట్రేషన్ ఆధారంగా ఎంపిక చేయనున్నట్లు తెలిపింది. ప్రాథమికంగా ఒక సంవత్సరం కాలానికి లేదా రెగ్యులర్ సిబ్బందిని నియమించే వరకు (ఏది ముందైతే అది) ఈ డెప్యుటేషన్ అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది.

ఎంపిక కమిటీలు:

జిల్లా స్థాయి కమిటీ (DIETs/CTEs/IASE కొరకు) ఛైర్‌పర్సన్‍గా సంబంధిత జిల్లా కలెక్టర్, సభ్యుల కన్వీనర్‍గా జిల్లా విద్యాశాఖాధికారి (DEO), సభ్యులుగా పరిధిలోని డీఈఓలు, సంబంధిత సంస్థ ప్రిన్సిపాల్, కలెక్టర్ నామినేట్ చేసిన అధికారి, ఇద్దరు సబ్జెక్ట్ నిపుణులు, వర్సిటీల నుంచి ఇద్దరు ప్రొఫెసర్లతో కమిటీ ఏర్పాటు చేయనున్నారు. ఇక రాష్ట్ర స్థాయి కమిటీ (SCERT కొరకు) ఛైర్‌పర్సన్‍గా పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్, సభ్యుల కన్వీనర్ SCERT డైరెక్టర్, సభ్యులుగా అడిషనల్ డైరెక్టర్ (కోఆర్డినేషన్), IASE ప్రిన్సిపాల్, విశ్వవిద్యాలయాల నుంచి ఇద్దరు ప్రొఫెసర్లతో కమిటీ ఏర్పాటు చేయనున్నారు. ఎంపిక ప్రక్రియను 2026 ఆగస్టు 10లోగా పూర్తి చేసి, ఎంపికైన అభ్యర్థుల జాబితాను ప్రభుత్వ ఆమోదానికి పంపాలని అన్ని జిల్లా విద్యాధికారులు, సంబంధిత అధికారులను పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది.

Next Story