ఒక వ్యక్తికి ఒకే ఓటు ఎస్ ఐ ఆర్ లక్ష్యం : ఎంపీ

by Taduka Kalyani |

అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ఒక వ్యక్తికి ఒకే ఓటు ఉండాలనే లక్ష్యంతోనే ఎస్‌ఐఆర్ నిర్వహిస్తున్నట్లు ఎంపీ మాధవనేని రఘునందన్ రావు తెలిపారు.

ఒక వ్యక్తికి ఒకే ఓటు ఎస్ ఐ ఆర్ లక్ష్యం : ఎంపీ
X

దిశ, సిద్దిపేట అర్బన్: అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ఒక వ్యక్తికి ఒకే ఓటు ఉండాలనే లక్ష్యంతోనే ఎస్‌ఐఆర్ నిర్వహిస్తున్నట్లు ఎంపీ మాధవనేని రఘునందన్ రావు తెలిపారు. సిద్దిపేట జిల్లా అర్బన్ మండలం బక్రీ చెప్యాల గ్రామ శివారులోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన 'మన్ కీ బాత్' కార్యక్రమంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆల్ ఇండియా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీ మెదక్, సిద్దిపేట బీజేపీ కార్యాలయాలను ప్రారంభించడం సంతోషకరమని పేర్కొన్నారు. కార్యాలయాల నిర్మాణానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రారంభమైన ఎస్‌ఐఆర్ (Special Intensive Revision) ప్రక్రియ తెలంగాణలో ఈ నెల 25 నుంచి ప్రారంభమైందని తెలిపారు. బీజేపీకి చెందిన బీఎల్‌ఏలు ఈ ప్రక్రియలో విధిగా పాల్గొని పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్, కమ్యూనిస్టు, ఎంఐఎం పార్టీల నేతలు తమ బీఎల్‌ఏల ద్వారా ఓటర్లలో భయాందోళనలు సృష్టిస్తున్నారని ఆరోపించారు.

గ్రామాల నుంచి పట్టణాలకు వెళ్లిన వారి ఓట్లకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని, బీఎల్‌ఏలు, బీఎల్‌వోలు ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నారని అన్నారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా "ఒక వ్యక్తికి ఒకే ఓటు" అనే సూత్రాన్ని ఎస్‌ఐఆర్ స్పష్టంగా అమలు చేస్తోందన్నారు. ఎస్‌ఐఆర్ ద్వారా ముస్లింలు, కాంగ్రెస్ లేదా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న వారి ఓట్లు తొలగిస్తారని కొందరు మంత్రులు చెప్పడం రాజ్యాంగంపై విశ్వాసం లేనట్టేనని విమర్శించారు. కొంతమంది రాజకీయ నాయకులు బీఎల్‌ఏలు, బీఎల్‌వోలను తమ ఇళ్లకు పిలిపించి మ్యాపింగ్ చేస్తున్నారని, సిద్దిపేటలోనూ ఇలాంటి ఘటనలు తమ దృష్టికి వచ్చాయని తెలిపారు. దీనిపై జిల్లా కలెక్టర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తున్నామని చెప్పారు. ఎస్‌ఐఆర్‌పై తప్పుడు ప్రచారం చేసే వారిపై రానున్న రోజుల్లో క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అలాగే ప్రతి ఒక్కరూ ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వినే అలవాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు.

Next Story