- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రూ.4 వేల కోట్ల బకాయిలు చెల్లించని రైస్ మిల్లర్లు
రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి రూ.4 వేల కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉండగా.. వారి నుంచి ఎలాంటి స్పందనా లేదు.

దిశ, తెలంగాణ బ్యూరో : రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తున్నారు. సుమారు రూ.4 వేల కోట్ల బకాయిలు చెల్లించేందుకు ముప్పుతిప్పలు పెడుతున్నారు. చర్యలు తీసుకుంటామని అధికారులు నోటీసులు జారీ చేసినా స్పందించడం లేదు. పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసినా భయపడటం లేదు. చివరకు ఆస్తులు జప్తు చేసేందుకు వెళ్లిన అధికారులకూ చుక్కెదురవుతున్నది. అక్కడ మనుషులు తప్పా.. ఆస్తులు కనిపించడం లేదు. దీంతో ప్రభుత్వం కలెక్టర్లను రంగంలోకి దింపింది. బకాయిలను రాబట్టే బాధ్యతను సీఎం రేవంత్ రెడ్డి వారికి అప్పగించారు.
బీఆర్ఎస్ హయాంలోనే అక్రమాలు..
గత బీఆర్ఎస్ పాలనలో గులాబీ లీడర్ల అండదండలు ఉండటంతో రైస్ మిల్లర్లు ఆడిందే ఆట, పాడిందే పాటగా సాగిందనే విమర్శలు ఉన్నాయి. దీంతో పౌరసరఫరాల శాఖకు చెల్లించాల్సిన బకాయిల విషయాన్ని నాటి పాలకులు సీరియస్‌గా తీసుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. సివిల్ సప్లయ్స్ శాఖ ప్రతి ఏటా రైతుల వద్ద ధాన్యాన్ని కొనుగోలు చేసి, కస్టమ్ మిల్లింగ్ కోసం మిల్లర్లకు అప్పగిస్తుంటుంది. 2022–23లో దాదాపు రూ. 7 వేల కోట్ల విలువైన ధాన్యం మిల్లింగ్ కోసం అప్పగిస్తే.. మిల్లర్లు వెనక్కి ఇవ్వలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మిల్లర్ల ఆగడాలను గుర్తించింది. మిల్లర్ల నుంచి రావాల్సిన బియ్యాన్ని వెనక్కి తీసుకునేందుకు చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. దీంతో ఏడాది క్రితం వరకు మిల్లర్ల నుంచి అధికారులు సుమారు రూ.3 వేల కోట్ల విలువైన బకాయిలను రాబట్టారు. మిగతా రూ.4 వేల కోట్లను రాబట్టడం పెద్ద సవాలుగా మారిందని అధికార వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
చట్టాలకు చిక్కకుండా ఎత్తులు..
పెండింగ్ బకాయిలు చెల్లించాలని అధికారులు నోటీసులు ఇచ్చినా.. మిల్లర్లు స్పందించడం లేదని తెలిసింది. దీంతో సుమారు 300 మందిపై పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేశారు. దీంతో సదరు మిల్లర్లు చట్టపరంగా కోర్టుల్లో కేసులను ఎదుర్కొంటున్నారు. ఇక చివరి అస్త్రంగా రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగించేందుకు సిద్ధమైన అధికారులకూ వారు షాక్ ఇస్తున్నారు. ఆస్తులను జప్తు చేసేందుకు వెళ్తే.. అప్పటికే తమ, కుటుంబ సభ్యుల పేర్ల మీద ఉన్న ఆస్తులను ఇతర వ్యక్తులకు రిజిస్ట్రేషన్ ద్వారా బదలాయించడమో, విక్రయించడమో చేసేస్తున్నారు. దీంతో డిఫాల్ట్ మిల్లర్లపై ఎలాంటి చర్యలు తీసుకోలేని నిస్సహాయస్థితిలో ఉన్నామని అధికారులు అంటున్నారు.
మంత్రులకు సమన్వయ బాధ్యతలు!
ఇటీవల జరిగిన కలెక్టర్ల సదస్సులో డిఫాల్ట్ మిల్లర్ల అంశం ప్రధానంగా ప్రస్తావనకు వచ్చింది. బకాయిలు రాబట్టేందుకు కలెక్టర్లు ప్రత్యేక చొరవ చూపాలని సీఎం ఆదేశించారు. కొందరు అధికారులు, రూలింగ్ పార్టీ లీడర్లు మిల్లర్లకు సపోర్ట్‌గా ఉంటున్నారని, రికవరీలో అడ్డుపడుతున్నారని కలెక్టర్లు సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. దీంతో సదరు అధికారుల వివరాలు ఇవ్వాలని నిఘా వర్గాలను సీఎం ఆదేశించినట్లు సమాచారం. అలాగే, మిల్లర్ల నుంచి బకాయిలను రాబట్టేందుకు స్థానిక లీడర్లు కలెక్టర్లకు మద్దతు ఇచ్చే విధంగా సమన్వయం చేసే బాధ్యతలను జిల్లా మంత్రులకు అప్పగించినట్లు సమాచారం.






