స్థానిక సంస్థల ఆడిట్ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు: NIRDPRలో ముగిసిన జాతీయ స్థాయి వర్క్‌షాప్

by Kema Shiva Kumar |

సంస్థాగత యంత్రాంగాన్ని, వృత్తిపరమైన సమర్థతను, స్థానిక ప్రభుత్వాలకు బాధ్యత వహించే ప్రాథమిక ఆడిటింగ్ సంస్థల (PAI) ఆడిట్ పద్ధతులను బలోపేతం చేయడం లక్ష్యంగా.. హైదరాబాద్‌లోని జాతీయ గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ సంస్థ (NIRDPR)లో మూడు రోజుల వర్క్‌షాప్ నిర్వహించారు.

స్థానిక సంస్థల ఆడిట్ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు: NIRDPRలో ముగిసిన జాతీయ స్థాయి వర్క్‌షాప్
X

దిశ, వెబ్‌డెస్క్: సంస్థాగత యంత్రాంగాన్ని, వృత్తిపరమైన సమర్థతను, స్థానిక ప్రభుత్వాలకు బాధ్యత వహించే ప్రాథమిక ఆడిటింగ్ సంస్థల (PAI) ఆడిట్ పద్ధతులను బలోపేతం చేయడం లక్ష్యంగా.. హైదరాబాద్‌లోని జాతీయ గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ సంస్థ (NIRDPR)లో మూడు రోజుల వర్క్‌షాప్ నిర్వహించారు. గ్రామీణాభివృద్ధి అంతర్గత ఆడిట్ కేంద్రం (CIARD), స్థానిక నిధుల ఆడిట్ డైరెక్టరేట్లు (DLFA), రాష్ట్ర ఆడిట్ విభాగాల కోసం అంతర్జాతీయ స్థానిక సంస్థల ఆడిట్ కేంద్రం (ICAL) సహకారంతో 2026 జనవరి 19 నుంచి 21 వరకు ఈ కార్యక్రమం జరిగింది. ఈ ముగింపు సమావేశానికి భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) సంజయ మూర్తి, ఎన్ఐఆర్‌డీపీఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ జి.నరేంద్ర కుమార్, డిప్యూటీ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ మనీశ్ కుమార్, పంచాయతీ రాజ్ శాఖ అదనపు కార్యదర్శి సుశీల్ కుమార్ లోహానీ హాజరయ్యారు. ఐసీఏఎల్ డైరెక్టర్ జనరల్ హెచ్.కె. ధర్మదర్శి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 23 రాష్ట్రాల నుంచి డీఎల్‌ఎఫ్‌ఏలు, రాష్ట్ర ఆడిట్ విభాగాలు, ఈఎల్‌ఎఫ్‌ఏలకు చెందిన 41 మంది ఉన్నతాధికారులు, వివిధ రాష్ట్రాల ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్స్‌ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వర్క్‌షాప్ డైరెక్టర్ డాక్టర్ యు.హేమంత కుమార్ కార్యక్రమ వివరాలను వెల్లడించారు. స్థానిక నిధుల ఆడిటింగ్‌లో ఎదురవుతున్న సవాళ్లు, పీఏఐ పరిణతిని అంచనా వేయడం, కాగ్ సాంకేతిక మార్గనిర్దేశం - సహకార యంత్రాంగం వంటి అంశాలపై లోతైన చర్చలు జరిగాయని వివరించారు. ఆడిట్ ప్రణాళిక, రిపోర్టింగ్, స్థానిక సంస్థలతో సమన్వయం వంటి అంశాల్లో అనుభవాలను పంచుకోవడంపై ఈ వర్క్‌షాప్ ప్రధానంగా దృష్టి సారించింది. వివిధ రాష్ట్రాల స్థానిక నిధుల ఆడిట్ డైరెక్టర్లు ఐదు ప్రధాన అంశాలపై బృందాలుగా చర్చించారు. ఇందులో పీఏఐ పరిణతి, వర్చువల్ ఆడిట్ విధానం, గ్రామ పంచాయతీల రిమోట్ ఆడిట్, తనిఖీ నివేదికలు, ఆడిట్ ప్రణాళికల ప్రామాణీకరణ వంటి అంశాలున్నాయి. అలాగే ఐటీ, కృత్రిమ మేధ (AI), కాట్స్ (CATS) సాధనాలను ఉపయోగించి టీజీఎస్‌ (TGS)ను బలోపేతం చేయడంపైనా చర్చించారు. స్థానిక సంస్థల పాలనలో ఆడిట్ పరిధిని, నాణ్యతను, పారదర్శకతను పెంపొందించడంలో సరళీకృత, ప్రామాణిక ఆడిట్ వ్యవస్థల ఆవశ్యకతను ఈ బృంద చర్చలు స్పష్టం చేశాయి.

సదస్సులో పాల్గొన్న వారితో భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ సంభాషించారు. వివిధ బృందాలు సమర్పించిన ప్రజెంటేషన్లను అభినందించిన ఆయన.. పలు రాష్ట్రాలు ఎదుర్కొంటున్న సవాళ్లను, వారు అనుసరిస్తున్న ఉత్తమ విధానాలను పరిగణనలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు. వ్యవస్థాగత మెరుగుదల కోసం త్వరలో జరగబోయే అన్ని రాష్ట్రాల కార్యదర్శుల వర్క్‌షాప్‌లో వీటిని ప్రదర్శిస్తామని తెలిపారు. ఎన్ఐఆర్‌డీపీఆర్ డైరెక్టర్ జనరల్ ముగింపు ఉపన్యాసంతో ఈ కార్యక్రమం ముగిసింది.

Next Story