- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సవరించిన వేతనాలు తక్షణమే అమలు చేయాలి:ఐఎన్టీయూసీ
తెలంగాణ ప్రభుత్వం జీవో నెం.6 ద్వారా ప్రకటించిన సవరించిన కనీస వేతనాలు తక్షణమే అమలు చేయాలని, కార్మికులకు రావలసిన వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని సారపాక ఐటీసీ భద్రాచలం పేపర్‌బోర్డ్స్ ఎంప్లాయీస్ యూనియన్ యాజమాన్యాన్ని డిమాండ్ చేసింది.

దిశ,బూర్గంపాడు: తెలంగాణ ప్రభుత్వం జీవో నెం.6 ద్వారా ప్రకటించిన సవరించిన కనీస వేతనాలు తక్షణమే అమలు చేయాలని, కార్మికులకు రావలసిన వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని సారపాక ఐటీసీ భద్రాచలం పేపర్‌బోర్డ్స్ ఎంప్లాయీస్ యూనియన్ యాజమాన్యాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం యూనియన్ ప్రతినిధులు ఐటీసీ యూనిట్ జనరల్ మేనేజర్ కు ఒక అధికారిక వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఐఎన్టీయూసీ యూనియన్ అధ్యక్షులు గోనే రామారావు, ప్రధాన కార్యదర్శి యారం పిచ్చిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం 'కోడ్ ఆన్ వేజెస్, 2019' ప్రకారం మే 30, 2026న జారీ చేసిన G.O.Ms.No.6 ప్రకారంగా షెడ్యూల్-I లోని ఎంప్లాయ్‌మెంట్ సీరియల్ నెంబర్లు 4,9, 13, 41, 47, 48, 49, 50లకు సంబంధించిన సవరించిన కనీస వేతనాలు జూన్ 1, 2026 నుంచి అమల్లోకి వచ్చాయని గుర్తుచేశారు.
ప్రభుత్వం ప్రకటించిన తేదీ నుంచే ఆ కనీస వేతనాలను అమలు చేయడం ప్రతి యాజమాన్యానికి చట్టబద్ధమైన, తప్పనిసరి బాధ్యత అని వారు స్పష్టం చేశారు. అయినప్పటికీ, దేశంలోనే ప్రముఖమైన, సామాజిక బాధ్యత గల ఐటీసీ లిమిటెడ్ - భద్రాచలం(సారపాక) యూనిట్‌లో ఇప్పటివరకు ఈ సవరించిన వేతనాలు అమలు కాకపోవడం విచారకరమన్నారు. దీనివల్ల అర్హులైన కార్మికులు తమకు చట్టబద్ధంగా లభించవలసిన వేతనాలకు దూరమవుతూ, జీవనోపాధిపై ప్రతికూల ప్రభావం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. యాజమాన్యం తక్షణమే ప్రభుత్వ ఉత్తర్వులను సకాలంలో అమలు చేసి కార్మికుల హక్కులను పరిరక్షించాలన్నారు. భవిష్యత్తులో ప్రభుత్వం ప్రకటించే వేరియబుల్ డియర్నెస్ అలవెన్స్ ఇతర చట్టబద్ధమైన వేతన సవరణలను ప్రభుత్వం నిర్ణయించిన తేదీల నుంచే ఆలస్యం లేకుండా అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ ఉత్తర్వుల అమలు, బకాయిల చెల్లింపు తేదీలు, సంబంధిత వివరాలను ఐఎన్టీయూసీ యూనియన్‌కు లిఖితపూర్వకంగా తెలియజేయాలన్నారు. న్యాయమైన, చట్టబద్ధమైన తమ డిమాండ్లను యాజమాన్యం వెంటనే అమలు చేస్తుందని ఆశిస్తున్నామని, ఒకవేళ అనవసర జాప్యం కొనసాగించినట్లయితే 'కోడ్ ఆన్ వేజెస్, 2019' ఇతర కార్మిక చట్టాల ప్రకారం సంబంధిత కార్మిక శాఖ అధికారులు,లేబర్ కమిషనర్, ఇతర సమర్థ అధికారులను ఆశ్రయిస్తామని యూనియన్ నాయకులు హెచ్చరించారు. అటువంటి పరిస్థితి ఏర్పడితే తలెత్తే పారిశ్రామిక సంబంధాల సమస్యలు,కార్మికుల అసంతృప్తి,చట్టపరమైన పరిణామాలకు పూర్తి బాధ్యత యాజమాన్యానిదేనని వారు స్పష్టం చేశారు. కార్మికుల శ్రమకు తగిన గౌరవం ఇవ్వడం, ప్రభుత్వం నిర్ణయించిన కనీస వేతనాలను సకాలంలో అమలు చేయడం ప్రతి బాధ్యతాయుతమైన యాజమాన్యం యొక్క ధర్మమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ముఖ్య నాయకులు, ప్రతినిధులు పాల్గొన్నారు.






