సింగరేణిలో దుస్థితికి కారణం కాంగ్రెస్, బీఆర్ఎస్ లే : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

by Naga Rani Yarlagadda |

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్వహించిన బీజేపీ 'సింగరేణి భరోసా యాత్ర'లో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు.

సింగరేణిలో దుస్థితికి కారణం కాంగ్రెస్, బీఆర్ఎస్ లే : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్వహించిన బీజేపీ 'సింగరేణి భరోసా యాత్ర'లో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. సింగరేణి సంస్థ అభివృద్ధి విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను ప్రస్తావిస్తూ.. గత ప్రభుత్వాల వైఖరిపై మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రభుత్వ కాలంలో దేశంలో అతిపెద్ద బొగ్గు కుంభకోణం జరిగిందని కిషన్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన బొగ్గు గనుల కేటాయింపులను సుప్రీంకోర్టు రద్దు చేసిందని, అనంతరం బొగ్గు గనుల కేటాయింపులు పారదర్శకంగా జరగాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం వేలం ప్రక్రియ లేకుండా సింగరేణికి కేటాయించిన ఏకైక బొగ్గు గని తాడిచర్ల-2 బ్లాక్ అని తెలిపారు. ఈ బ్లాక్‌లో గ్రేడ్-8 నాణ్యమైన బొగ్గు లభిస్తుందని, మరో 40 నుంచి 50 సంవత్సరాల పాటు సింగరేణికి అవసరమైన బొగ్గు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. తాడిచర్ల-2 బ్లాక్‌ను సింగరేణికి కేటాయించిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఒడిశాలోని నైనీ కోల్ బ్లాక్ కూడా మోదీ ప్రభుత్వమే సింగరేణికి కేటాయించిందని గుర్తు చేశారు.

సింగరేణి సమస్యలపై తాను అనేకసార్లు ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లానని, సంస్థకు మరిన్ని బొగ్గు బ్లాకులు అవసరమని కేంద్రానికి వివరించానని చెప్పారు. ప్రస్తుతం సింగరేణి ఎదుర్కొంటున్న పరిస్థితులకు బీఆర్ఎస్ ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించాలని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అహంకారపూరిత నిర్ణయాలు, సింగరేణిని కేవలం ఓటు బ్యాంకుగా ఉపయోగించుకోవడమే సంస్థ పరిస్థితి దిగజారడానికి కారణమని విమర్శించారు. పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణికి చేసిన మేలు ఏమిటో ప్రజలకు చెప్పాలని కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. ఒడిశాలోని నైనీ కోల్ బ్లాక్ కేటాయింపుపై కేసీఆర్ ఎప్పుడూ మాట్లాడలేదన్నారు. సింగరేణికి ఇవ్వాల్సిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.

సింగరేణి నుంచి తీసుకున్న బొగ్గు, విద్యుత్ బకాయిలను చెల్లించకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం సుమారు రూ.24 వేల కోట్ల అప్పు పెట్టిందని ఆరోపించారు. రాష్ట్రంలో 49 శాతం వాటా ఉన్నప్పటికీ బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు సింగరేణి అభివృద్ధి కోసం కేంద్రాన్ని సమర్థవంతంగా సంప్రదించలేదని, ఈ రెండు పార్టీలు సింగరేణిని రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగించుకున్నాయని కిషన్ రెడ్డి విమర్శించారు.

Next Story