హేమ మాలిని బయోపిక్‌లో దీపికా పదుకొణె.. చాలా అందమైన, ప్రతిభావంతమైన నటి అంటూ ప్రశంసలు

by Mallepaka Hamsa |

దీపికా పదుకొణెకు గనుక తన జీవిత కథలో నటించడానికి ఆసక్తి ఉంటే, తప్పకుండా ఆమె తన పాత్రను చేయవచ్చని హేమ మాలిని తెలిపారు.

హేమ మాలిని బయోపిక్‌లో దీపికా పదుకొణె.. చాలా అందమైన, ప్రతిభావంతమైన నటి అంటూ ప్రశంసలు
X

దిశ, సినిమా: బాలీవుడ్ సినీయర్ నటి హేమ మాలిని ఆరు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో గుర్తుండిపోయే పాత్రలు చేసి కోట్లాది మంది అభిమానుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు. డ్రీమ్ గర్ల్‌గా నిలిచిపోయిన ఆమె ఇప్పుడు కాస్త సినిమాలను తగ్గించారు. కానీ తన బయోపిక్ వస్తే మాత్రం తన పాత్రను ఎవరు పోషించాలనుకుంటున్నారనే విషయాన్ని వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచారు. చిత్ర పరిశ్రమలో హేమ మాలిని అడుగుపెట్టి 60 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, ముంబైలో ‘డ్రీమ్ గర్ల్స్ డైమండ్ జూబ్లీ’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న ఆమె తన కెరీర్‌కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ క్రమంలోనే మీడియా ప్రతినిధులు ఒకవేళ మీ బయోపిక్ వస్తే మీ పాత్రలో ఎవరు నటిస్తే బాగుంటుందని ప్రశ్నించారు.

ముఖ్యంగా స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె నటిస్తే ఎలా ఉంటుందనే ప్రస్తావన రాగా, హేమ మాలిని ఎంతో సానుకూలంగా స్పందించారు. దీపికా పదుకొణెకు గనుక తన జీవిత కథలో నటించడానికి ఆసక్తి ఉంటే, తప్పకుండా ఆమె తన పాత్రను చేయవచ్చని హేమ మాలిని తెలిపారు. అంతేకాకుండా దీపికా చాలా అందమైన, అద్భుతమైన ప్రతిభావంతమైన నటి అంటూ ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు. తన పాత్రకు దీపికా పదుకొణె అన్ని విధాలా సరైన ఎంపిక అని ఆమె ఒకే మాటలో స్పష్టం చేశారు. ప్రస్తుతం హేమ మాలిని బయోపిక్‌కు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన లేదా చర్చలు లేనప్పటికీ, సీనియర్ నటి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ గనుక పట్టాలెక్కితే డ్రీమ్ గర్ల్ పాత్రలో దీపికాను చూడటం ప్రేక్షకులకు ఒక గొప్ప అనుభూతిని ఇస్తుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Next Story