కేజీబీవీలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ..

by Jakkula.Mamatha |

కేజీబీవీలో విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరచడంతో పాటు విద్యార్థినులకు ప్రభుత్వం కల్పిస్తున్న అన్ని సౌకర్యాలు నాణ్యతతో అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ ప్రత్యేక అధికారిని, ఉపాధ్యాయులను ఆదేశించారు.

కేజీబీవీలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ..
X

దిశ, చారకొండ: కేజీబీవీలో విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరచడంతో పాటు విద్యార్థినులకు ప్రభుత్వం కల్పిస్తున్న అన్ని సౌకర్యాలు నాణ్యతతో అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ ప్రత్యేక అధికారిని, ఉపాధ్యాయులను ఆదేశించారు. మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని(కేజీబీవీ) సోమవారం ఉదయం ఆయన ఆకస్మికంగా సందర్శించి పాఠశాల నిర్వహణ, విద్యాబోధన, వసతి, భోజన ఏర్పాట్లు, విద్యార్థినులకు అందుతున్న సౌకర్యాలను సమగ్రంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణ, తరగతి గదులు, పరిశుభ్రత, తాగునీటి సదుపాయాలు, వసతి గదులను పరిశీలించి కలెక్టర్ సంతృప్తిని వ్యక్తం చేశారు.

అనంతరం 9వ తరగతి గదికి వెళ్లి విద్యార్థినులతో ప్రత్యక్షంగా మాట్లాడారు. జీవశాస్త్రం సబ్జెక్టుకు సంబంధించిన ప్రశ్నలు అడిగి వారి అభ్యాస స్థాయిని తెలుసుకున్నారు. పాఠ్యాంశాలపై విద్యార్థినుల అవగాహనను పరిశీలిస్తూ, ప్రతి అంశాన్ని పూర్తిగా అర్థం చేసుకొని చదివితేనే పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించవచ్చని కలెక్టర్ బాలికలకు సూచించారు. అనంతరం విద్యార్థినులతో ఆత్మీయంగా ముచ్చటించిన కలెక్టర్, కేజీబీవీలో విద్యాభ్యాసానికి సంబంధించిన వాతావరణం, హాస్టల్ సౌకర్యాలు, తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, మరుగుదొడ్లు, భద్రత, వైద్య సేవలు తదితర అంశాలపై అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినులు తమకు ఎదురయ్యే ఏ చిన్న సమస్యనైనా సంకోచం లేకుండా ఉపాధ్యాయులు, ప్రత్యేక అధికారి దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ సూచించారు.

పాఠశాలలో విద్యార్థినులకు అందిస్తున్న భోజన నాణ్యతపై ప్రత్యేకంగా దృష్టి సారించిన కలెక్టర్, ప్రభుత్వం నిర్దేశించిన వారాంతపు మెనూను పరిశీలించారు. మెనూ ప్రకారం ప్రతి రోజూ ఆహారం అందిస్తున్నారా లేదా అనే విషయాన్ని నేరుగా విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. భోజనం రుచి, నాణ్యత, పరిమాణం, పోషకాహార ప్రమాణాలపై కూడా కలెక్టర్ ఆరా తీశారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నాణ్యమైన ఆహారం అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఉపాధ్యాయులతో మాట్లాడిన కలెక్టర్, బాలికల విద్యాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికతో పనిచేయాలని, ప్రతి విద్యార్థిని నేర్చుకునే సామర్థ్యాన్ని నిరంతరం అంచనా వేస్తూ వెనుకబడిన వారికి అదనపు శిక్షణ అందించాలని చెప్పారు.

ఇంటర్మీడియట్, పదో తరగతుల విద్యార్థినులకు ప్రత్యేక అధ్యయన ప్రణాళిక రూపొందించి అత్యుత్తమ ఫలితాలు సాధించేలా కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. ప్రతి పాఠాన్ని సులభంగా అర్థమయ్యే విధంగా బోధిస్తూ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ సూచించారు. విద్యార్థినులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం బాలికల విద్యాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఉచిత విద్య, వసతి, పోషకాహారం, పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలు తదితర సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తోందని గుర్తు చేశారు. ఈ అవకాశాలను ప్రతి విద్యార్థిని సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలని సూచించారు. క్రమశిక్షణ, కష్టపడి చదివే అలవాటు, సమయపాలన విజయానికి పునాది అని కలెక్టర్ తెలిపారు.

అలాగే ఉపాధ్యాయులు బోధించే ప్రతి అంశాన్ని శ్రద్ధగా విని, ఇంటి వద్ద కూడా పునశ్చరణ చేస్తూ అన్ని సబ్జెక్టుల్లో ప్రతిభ కనబరచాలని విద్యార్థినులకు సూచించారు. విద్యతోనే భవిష్యత్తు ఉజ్వలంగా మారుతుందని, తల్లిదండ్రులు, పాఠశాల, జిల్లా గర్వపడేలా ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీల బలోపేతానికి అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందని, వాటి లక్ష్యం ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించడమేనని కలెక్టర్ తెలిపారు. కేజీబీవీ ప్రత్యేక అధికారి, ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేస్తే పాఠశాలలో మరింత మెరుగైన ఫలితాలు సాధిస్తాయని అన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అంగన్వాడీ కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించారు.

ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, రోగులకు చికిత్స, మందుల లభ్యత, వైద్య సిబ్బంది హాజరు, అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అందిస్తున్న పోషకాహారం, జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. మొదట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించారు. వైద్యులు విధుల్లో సమయానికి హాజరవుతున్నారా, రోగులకు సకాలంలో వైద్య సేవలు అందుతున్నాయా, అవసరమైన మందులు, అత్యవసర వైద్య పరికరాలు, ఇతర మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయా అనే అంశాలపై వైద్యాధికారులను ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు.

చికిత్స కోసం వచ్చే ప్రతి రోగికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మెరుగైన సేవలు అందించాలని, ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు మరింత విశ్వాసం పెరిగేలా వైద్య సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అధికారులు అత్యంత బాధ్యతతో అమలు చేయాలని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. మొదటి విడతలో మంజూరైన ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయడంతో పాటు, రెండో విడత లబ్ధిదారుల ఎంపికలో పూర్తి పారదర్శకత పాటించి నిజమైన అర్హులకే ఇళ్లు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణ సామగ్రి కొరత, సాంకేతిక సమస్యలు లేదా ఇతర కారణాలతో పనులు నిలిచిపోకుండా ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత శాఖ అధికారులకు సూచించారు. జిల్లా కలెక్టర్ వెంట చారకొండ తహసీల్దార్ ఉమా, కేజీబీవీ ప్రత్యేక అధికారి మంజుల, గ్రామ సర్పంచ్, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది తదితరులు ఉన్నారు.

Next Story