- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొత్త గూటికి రెవెన్యూ కార్యాలయాలు..!
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దాదాపు 12 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇంకా కొన్ని రెవెన్యూకు సంబంధించిన తహసీల్దార్, ఆర్డీవో కార్యాలయాలు అద్దె భవనాలు, పాడుపడ్డ శిథిలమైన పాత భవనాల్లోనే తమ కార్యకలాపాలు కొనసాగిస్తూ వస్తున్నాయి.

దిశ, సంగారెడ్డి: తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దాదాపు 12 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇంకా కొన్ని రెవెన్యూకు సంబంధించిన తహసీల్దార్, ఆర్డీవో కార్యాలయాలు అద్దె భవనాలు, పాడుపడ్డ శిథిలమైన పాత భవనాల్లోనే తమ కార్యకలాపాలు కొనసాగిస్తూ వస్తున్నాయి. అయితే జిల్లాల పునర్విభజన అనంతరం ప్రధానంగా రెవెన్యూకి సంబంధించిన తహసీల్దార్ కార్యాలయం, ఆర్డీవో కార్యాలయాలకు కొత్త భవనాలు ఎంతో అవసరం ఉంది. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు లేక ఇప్పటివరకు ఆయా కార్యాలయాలు అద్దె భవనాలు ఇతర పాత భవనాల్లోనే కొనసాగుతూ వస్తుండడం, అక్కడ విధులు నిర్వహించడం సిబ్బందికి ఎంతో ఇబ్బందికరంగా మారింది. దీనిని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వం తాజాగా రాష్ట్రంలోని 10 ఆర్డీవో కార్యాలయాలు, 107 తహసీల్దార్ కార్యాలయాలకు కొత్త భవనాల నిర్మాణం కోసం రూ. 263.25 కోట్లు మంజూరు చేసింది. అయితే ప్రతి భవనానికి రూ.2.25 కోట్ల చొప్పున నిధులు కేటాయించి, నిర్మాణ బాధ్యతలను తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్‌కు అప్పగించింది.
ప్రతి కార్యాలయానికి రూ.2.25కోట్లు ..
సంగారెడ్డి జిల్లాలోని మొగుడంపల్లి, జిన్నారం, మునిపల్లి, సంగారెడ్డి, మనూర్ మండల తహసీల్దార్ కార్యాలయాలకు నిధులు మంజూరు అయ్యాయి. ఇప్పటివరకు ఈ కార్యాలయాలు అన్ని అద్దె భవనాలు, శిథిలమైన పాత భవనాల్లో కొనసాగుతూ వస్తున్నాయి. సిద్దిపేటలో ఆరు కార్యాలయాలకు సిద్దిపేట జిల్లాలో కొమురవెల్లి, అక్కన్నపేట, దూల్మిట్ట, అక్బర్ పేట- భూంపల్లి, మద్దూర్, రాయపోల్ మండలాలకు చెందిన వాటికి కొత్త తహసీల్దార్ కార్యాలయ భవన నిర్మాణాల కోసం నిధులు మంజూరయ్యాయి. మెదక్ జిల్లాలో ప్రభుత్వం ప్రస్తుతం కొత్తగా మూడు ఆర్డీఓ కార్యాలయాలకు కొత్త భవనాల కోసం నిధులను మంజూరు చేసింది.
ఇందులో ఘనపూర్, చిలప్ చెడ్, నిజాంపేట డివిజన్ ఆర్డీవో కార్యాలయాలకు నిధులు మంజూరు అయ్యాయి. ఇటు తహసీల్దార్ కార్యాలయం, అటు ఆర్డీఓ కార్యాలయం రెండు కొత్త భవనాలకు ఒక్కోదానికి రూ.2.25కోట్ల చొప్పున ప్రభుత్వం నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తాజా ప్రభుత్వ నిర్ణయంతో ఇప్పటివరకు ఇబ్బందుల్లో తమ విధులను నెట్టుకొని వస్తూ పనిచేస్తున్న తహసీల్దార్, ఆర్డీవో కార్యాలయాలకు చెందిన సిబ్బందితో పాటు ఆయా ప్రాంతాల స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, నిర్మాణ బాధ్యతలు హౌసింగ్ కార్పొరేషన్ చేపట్టనుండగా త్వరలోనే వీటి పనులను ప్రారంభించి పూర్తి చేయనున్నారు.






