- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొత్త గూటికి రెవెన్యూ కార్యాలయాలు
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో ఏళ్లుగా అద్దె భవనాలు, శిథిలావస్థకు చేరుకున్న పాత కార్యాలయాల్లో కొనసాగుతున్న రెవెన్యూ కార్యాలయాలకు త్వరలో శాశ్వత గూటి లభించనుంది.

దిశ, ఆలూర్ : తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో ఏళ్లుగా అద్దె భవనాలు, శిథిలావస్థకు చేరుకున్న పాత కార్యాలయాల్లో కొనసాగుతున్న రెవెన్యూ కార్యాలయాలకు త్వరలో శాశ్వత గూటి లభించనుంది. రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ శాఖ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్రవ్యాప్తంగా 10 ఆర్డీవో కార్యాలయాలు, 107 తహసీల్దార్ కార్యాలయాలకు కొత్త భవనాల నిర్మాణానికి రూ.263.25 కోట్ల నిధులను మంజూరు చేసింది. ప్రతి భవన నిర్మాణానికి రూ.2.25 కోట్ల చొప్పున కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిర్మాణ బాధ్యతలను తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్‌కు అప్పగించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దాదాపు 12 సంవత్సరాలు గడిచినా అనేక తహసీల్దార్, ఆర్డీవో కార్యాలయాలు ఇప్పటికీ అద్దె భవనాలు లేదా శిథిలమైన పాత భవనాల్లోనే కొనసాగుతున్నాయి. సరైన మౌలిక వసతులు లేక అధికారులు, సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటుండగా, ప్రజలకు కూడా సేవలు పొందడంలో అసౌకర్యాలు ఏర్పడుతున్నాయి.
ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కొత్త భవనాల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిజామాబాద్ జిల్లాలో డొంకేశ్వర్, నిజామాబాద్ రూరల్, ఏరుగట్ల, ఇందల్వాయి, మోపాల్, సాలూర్ మండల తహసీల్దార్ కార్యాలయాలకు కొత్త భవనాలు నిర్మించేందుకు నిధులు మంజూరయ్యాయి. అలాగే కామారెడ్డి జిల్లాలో దోమకొండ, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట్, మద్నూర్, పిట్లం మండల తహసీల్దార్ కార్యాలయాలకు కూడా కొత్త భవనాల నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కొత్త భవనాలు నిర్మాణం పూర్తయితే ఆధునిక సౌకర్యాలతో ప్రజలకు మెరుగైన సేవలు అందే అవకాశం ఉంటుంది. అధికారులు, సిబ్బంది కూడా అనుకూల వాతావరణంలో విధులు నిర్వహించగలుగుతారు. కార్యాలయాల్లో రికార్డుల భద్రత, ప్రజల కోసం వేచిచూసే హాళ్లు, సమావేశ మందిరాలు, పార్కింగ్ వంటి సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. ప్రభుత్వ నిర్ణయంతో ఆయా ప్రాంతాల ప్రజలు, రెవెన్యూ శాఖ అధికారులు, ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే హౌసింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి నిర్మాణ పనులు ప్రారంభించే అవకాశం ఉంది. ఎన్నో ఏళ్లుగా కొత్త భవనాల కోసం ఎదురుచూస్తున్నరెవెన్యూ కార్యాలయాలకు ఈ నిర్ణయం శాశ్వత పరిష్కారంగా నిలుస్తుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఆలూర్‌కు మళ్లీ నిరాశే..!
రాష్ట్ర ప్రభుత్వం కొత్త తహసీల్దార్ కార్యాలయ భవనాలకు నిధులు మంజూరు చేసినప్పటికీ, ఆలూర్ మండలానికి మాత్రం ఈ విడతలో అవకాశం దక్కలేదు. కొత్త మండలంగా ఏర్పడి సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ తహసీల్దార్ కార్యాలయానికి సొంత భవనం లేకపోవడంతో అధికారులు, సిబ్బంది ఇరుకు గదుల్లోనే విధులు నిర్వహిస్తున్నారు. గదుల కొరత కారణంగా సిబ్బంది కూర్చోవడానికి కూడా ఇబ్బందులు ఎదుర్కొంటుండగా, వీఆర్ఏలకు ప్రత్యేక స్థలం లేక చెట్ల కిందే విధులు నిర్వహించాల్సిన పరిస్థితి ఉంది. కార్యాలయానికి వచ్చే ప్రజలు కూడా సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో తదుపరి విడతలో అయినా ఆలూర్ తహసీల్దార్ కార్యాలయానికి నూతన భవనాన్ని మంజూరు చేసి, శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు, రెవెన్యూ సిబ్బంది ప్రభుత్వాన్ని కోరుతున్నారు.






