తన కోసం కాకుండా సమాజం కోసం జీవించిన వ్యక్తి అంబేద్కర్ : రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి

by Taduka Kalyani |

తన కోసం కాకుండా సమాజం కోసం జీవించిన గొప్ప వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పేర్కొన్నారు.

తన కోసం కాకుండా సమాజం కోసం జీవించిన వ్యక్తి అంబేద్కర్ : రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి
X

దిశ, నర్సాపూర్: తన కోసం కాకుండా సమాజం కోసం జీవించిన గొప్ప వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పేర్కొన్నారు. ఆదివారం మెదక్ జిల్లా శివంపేట మండలం పిల్లుట్ల గ్రామంలో ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి తో కలిసి ఆయన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించటం ఆనందంగా ఉందన్నారు. ఈ విగ్రహం సమానత్వానికి ప్రతీక. సామాజిక న్యాయానికి చిహ్నం. ప్రతి పేద కుటుంబానికి ఆశాజ్యోతి అని వెల్లడించారు. అలాగే ప్రతి యువకుడికి స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. అంబేద్కర్ గారి జీవితం – మనందరికీ ఆదర్శమన్నారు. చిన్నతనంలోనే అంబేద్కర్ కుల వివక్షను ఎదుర్కొన్నాడని, చదువుతో ప్రపంచాన్ని గెలిచారన్నారు. వారు మనకు చెప్పిన గొప్ప సందేశం ఒక్కటే.. పుట్టుక మన చేతిలో ఉండదు.. కానీ జీవితాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలో మన చేతిలోనే ఉంటుందన్నారు.

బాబాసాహెబ్ డా. బి. ఆర్ అంబేద్కర్ బహుభాషావేత్త. ఆర్థికశాస్త్రం, రాజకీయ శాస్త్రం, న్యాయశాస్త్రం, చరిత్ర అన్నింటిలో నిష్ణాతుడనీ కొనియాడారు. అణగారిన వర్గాల కోసం జీవితాంతం పోరాటం చేశారనీ, అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడారనీ, సమాన హక్కుల కోసం దేశవ్యాప్తంగా ఉద్యమించారన్నారు. మన దేశానికి బీ.ఆర్ అంబేడ్కర్ అందించిన అత్యంత గొప్ప కానుక భారత రాజ్యాంగమని, రాజ్యాంగం ప్రతి భారతీయుడికి సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం, గౌరవప్రదమైన జీవితం అందించిందన్నారు. అందుకే ఆయనను భారత ప్రజాస్వామ్య శిల్పి గా పిలుస్తామన్నారు. బాబాసాహెబ్ చెప్పిన మార్గంలో సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, మానవ గౌరవం కోసం మనమందరం కలిసి ముందుకు తాగుదామని యువత బాబాసాహెబ్ జీవితాన్ని చదవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బుర్ర మురళి గౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాసిని రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి రాజిరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, కాంగ్రెస్ నాయకులు గంగాధర్, అంబేద్కర్ సంఘం నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Next Story