హిమాయత్‌సాగర్‌ నుంచి 339 క్యూసెక్కుల నీటి విడుదల

by Taduka Kalyani |

హైదరాబాద్ నగరానికి తాగునీటిని అందించే జంట జలాశయాల్లో ఒకటైన హిమాయత్‌సాగర్‌లో నీటిమట్టం పూర్తిస్థాయికి చేరువ కావడంతో ఆదివారం ఒక గేటును ఎత్తి 339 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.

హిమాయత్‌సాగర్‌ నుంచి 339 క్యూసెక్కుల నీటి విడుదల
X

దిశ, గండిపేట: హైదరాబాద్ నగరానికి తాగునీటిని అందించే జంట జలాశయాల్లో ఒకటైన హిమాయత్‌సాగర్‌లో నీటిమట్టం పూర్తిస్థాయికి చేరువ కావడంతో ఆదివారం ఒక గేటును ఎత్తి 339 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పాల్గొని గేటును ఎత్తి నీటి విడుదలను ప్రారంభించారు. ఆదివారం సాయంత్రం 6:30 గంటల నాటికి హిమాయత్‌సాగర్‌లో పూర్తిస్థాయి నీటిమట్టం 1763.50 అడుగులు కాగా, ప్రస్తుతం 1762.25 అడుగుల నీటిమట్టం నమోదైంది. జలాశయంలో 2.334 టీఎంసీల నీరు నిల్వ ఉండగా, ఎగువ ప్రాంతాల నుంచి 60 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికతో 339 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక ఉస్మాన్‌సాగర్‌లో పూర్తిస్థాయి నీటిమట్టం 1790 అడుగులు కాగా, ప్రస్తుతం 1784.15 అడుగులుగా నమోదైంది. జలాశయంలో 2.378 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రస్తుతం ఉస్మాన్‌సాగర్‌కు ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో రెండూ లేవని అధికారులు తెలిపారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా జలాశయాల్లోకి మరింత నీరు చేరే అవకాశం ఉండటంతో అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Next Story